జగన్మోహన్ రెడ్డి కెపాసిటీని జనసేన అధినేత పవన్ కల్యాణ్ బాగానే అంచనా వేశారు. అందుకనే వచ్చేఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీచేస్తే వీరమరణం తప్పదని స్వయంగా పవనే అంగీకరించారు. ఈ విషయాన్ని శ్రీకాకుళం జిల్లా రణస్ధలంలో జరిగిన యువశక్తి బహిరంగసభలో ప్రకటించారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేస్తే ఎదురైన వీరమరణాన్ని పవన్ ఇంకా మరచిపోలేకపోతున్నట్లున్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి కొట్టిన దెబ్బ ఇంకా మరచిపోయినట్లు లేదు.  అందుకనే తనకు పదిమంది ఎంఎల్ఏలను ఇచ్చి ఉండాల్సింది అంటు పదేపదే నిష్టూరాలాడుతున్నారు.





ఒంటరిగా పోరాటంచేసి వీరమరణం పొందటం ఇష్టంలేకే పొత్తు పెట్టుకుని పోటీచేయాలని డిసైడ్ అయినట్లు చెప్పకనే చెప్పేశారు. జనసైనికులను నమ్ముకుంటే వీరమరణం తప్పదని కూడా డిసైడ్ అయిపోయినట్లున్నారు.  చంద్రబాబునాయుడుతో ఈమధ్య జరిగిన భేటీలో పొత్తులపైన చర్చించామనే అర్ధమొచ్చినట్లుగా చెప్పారు. గౌరవమర్యాదలకు లోటు లేకపోతే పొత్తు పెట్టుకుని పోటీచేస్తామన్నారు. గౌరమర్యాదలు దక్కకపోతే ఒంటరిపోరాటం తప్పదని కూడా పవన్ తేల్చేశారు. పవన్ చెప్పిన గౌరవమర్యాదలు అంటే సీట్ల కేటాయింపు తప్ప మరోటికాదని అందరికీ అర్ధమైపోయింది.






జనసేన 45 సీట్లు అడుగుతుంటే చంద్రబాబు మాత్రం 24 అసెంబ్లీ, 2 పార్లమెంటు సీట్లు ఇస్తానని ప్రతిపాదించినట్లు ప్రచారం జరుగుతోంది. సీట్ల కేటాయింపుపై పవన్ ఏమీ మాట్లాడకపోయినా అడిగినన్ని సీట్లు ఇవ్వకపోతే పొత్తు పెట్టుకునేది లేదని పరోక్షంగా చెప్పారు. జనాలందరు అనుకుంటే తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తానని లేకపోతే అన్నీ మూసుకుని ఇంట్లు కూర్చుంటానన్నారు. అయితే పవన్ మరచిపోయిన విషయం ఒకటుంది. అదేమిటంటే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయాలంటే ముందు 175 సీట్లకు పోటీచేయాలని.





గెలుపోటములతో సంబంధంలేకుండా 175 సీట్లలో పోటీచేస్తే గెలిచే సీట్లను బట్టి ముఖ్యమంత్రి అయ్యేది లేనిది తేలుతుంది. సీఎంగా ప్రమాణస్వీకారం చేయాలంటే కనీసం 89 సీట్లలో గెలవాల్సుంటుంది. మరి పొత్తుల్లో పోటీచేసే సీట్లే 89 లేనపుడు ఇక పవన్ ముఖ్యమంత్రిగా ఎలా ప్రమాణస్వీకారం చేద్దామని అనుకున్నారో అర్ధంకావటంలేదు. ఏదేమైనా పవన్ మాటలు విన్నతర్వాత పోటీచేసే విషయంలో బాగా అయోమయంలో ఉన్నట్లు అర్దమైపోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: