దేశ‌వ్యాప్తంగా ఆస‌క్తిని రేకెత్తిస్తున్న ఢిల్లీ ఎన్నిక‌ల్లో పోలింగ్ గ‌డువు స‌మీపిస్తున్న కొద్ది ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి.  ‘నిరసనకారులకు షాక్‌ తగిలేలా ఈ నెల 8న ఓటెయ్యాలి’ అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలు క‌ల‌క‌లం సృష్టించింది. కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ నిర్వహించిన ఓ సభలో ‘దేశద్రోహులను కాల్చిపారేయండి’ అంటూ నినాదాలు చేయడాన్ని, ‘చెప్తే మాటవినని వారికి బుల్లెట్లతో అర్థమయ్యేలా చెప్పండి’ అంటూ యూపీ సీఏం యోగి ఆదిత్యనాథ్ కామెంట్లు సైతం వివాదంగా మారాయి.

 

ఈ నేప‌థ్యంలో, ఢిల్లీ ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ శ్రేణులు సృష్టించిన భయానక వాతావరణాన్ని చూసి కలత చెంది ఈ లేఖ రాస్తున్నామని.. దేశ పౌరులుగా, హిందువులు, ముస్లింలు, సిక్కులు, ఆదివాసీ, దళిత మహిళల పక్షాన స్పందిస్తున్నామని పేర్కొంటూ, ఈ మేరకు సోమవారం ఆర్థికవేత్త దేవకి జైన్‌, హక్కుల కార్యకర్తలు లైలా తయాబ్జీ, కమలా భాసిన్‌, మాజీ భారత రాయబారి మధు బాధురి తదితర ప్రముఖులు,  ఆలిండియా ప్రోగ్రెసివ్‌ ఉమెన్స్‌ అసోసియేషన్‌ (ఏఐపీడబ్ల్యూఏ), నేషనల్‌  ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఉమెన్‌ (ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ) వంటి సంస్థలు సంయుక్తంగా ప్రధానికి బహిరంగ లేఖ రాశాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు రేప్‌ను ఓ ప్రచారాస్త్రంగా, హెచ్చరికగా వాడుకుంటున్నారని, తమకు ఓటేయకుంటే లైంగికదాడులు జరిగిపోతాయంటూ దేశంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని 170 మంది మహిళా ప్రముఖులు, పలు మహిళా సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు తరుచూ విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారని, మీ మౌనంతో అలాంటివారిని పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీని విమర్శించారు. 

 

 

షాహీన్‌బాగ్‌లో లక్షల మంది గుమిగూడుతున్నారని, వారు ఢిల్లీ ప్రజల ఇండ్లల్లోకి చొరబడి మహిళలపై అఘాయిత్యాలు చేసి, హత్యచేసే అవకాశం ఉన్నదంటూ బీజేపీ ఎంపీ పర్వేశ్‌ వర్మ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ‘దేశంలోని మహిళలు, చిన్నారులందరికీ ముప్పు పొంచి ఉన్నదని మీరు చెప్పదలుచుకున్నారా?’ అని ప్రశ్నించారు. బీజేపీ చేస్తున్న ఈ విద్వేష ప్రచారాన్ని చరిత్ర మరిచిపోదని, దేశ ప్రజలు మన్నించరని హెచ్చరించారు. ‘మీ పార్టీ సభ్యులు సృష్టించిన భయానక వాతావరణాన్ని దేశం మొత్తం చూస్తున్నది. మీ రెచ్చగొట్టే వ్యాఖ్యలకు ప్రభావితమై.. గత నెల 30న జామియా వర్సిటీ విద్యార్థులపై రామ్‌ భక్త్‌ గోపాల్‌ కాల్పులు జరిపాడు. ఈ నెల 1న మరో ఉగ్రవాది షాహీన్‌బాగ్‌లో మహిళలవైపు తుపాకీ పేల్చాడు’ అని పేర్కొన్నారు. ‘మహిళలపై లైంగిక దాడులు జరుగుతాయంటూ బీజేపీ నేతలు తరుచూ తమ ప్రచారంలో హెచ్చరిస్తున్నారు. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌కు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలపై హింసకు పాల్పడాలంటూ తమ శ్రేణులకు పిలుపునిస్తున్నారు. ప్రభుత్వాధినేతగా మీరు (మోదీ) మౌనంగా ఉండి ఇలాంటి విద్వేష పూరిత వాతావరణాన్ని ప్రోత్సహిస్తున్నారు. తద్వారా సమాజంలోని అన్ని వర్గాల మహిళలు అభద్రతాభావానికి గురవుతున్నారు. “బీజేపీకి ఓటేయండి లేదంటే మీపై లైంగికదాడి జరుగుతుంద”నే సందేశాన్ని ఢిల్లీ మహిళలకు అందించాలని అనుకుంటున్నారా?’ అని ప్రధానిని ప్రశ్నించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: