ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో జరుగుతున్న ఐటీ దాడులు తెలుగుదేశం పార్టీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. గత నాలుగు రోజులుగా జరుగుతున్న దాడుల్లో పార్టీకి చెందిన పెద్ద పెద్ద నేతల పేర్లు బయటకు వస్తున్నాయి. చంద్రబాబు, నారా లోకేష్‌లకు అత్యంత సన్నిహితులుగా ముద్రపడ్డ వారే టార్గెట్‌గా జరుగుతున్న ఈ దాడుల్లో విస్తుగొలిపే నిజాలు బయటకు వస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే 70, 80 కోట్ల వరకు తప్పుడు లెక్కలు బయటకు వచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది.


దాడుల్లో ప‌లు కీల‌క డాక్యుమెంట్ల‌ను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ప్రతీ విషయాన్ని రాద్ధాంతం చేసే టీడీపీ నాయకులు ఈ ఐటీ దాడుల‌పై మాత్రం నోరెత్త‌డానికి సాహ‌సం చేయ‌డం లేదు. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు దాదాపు ప‌దేళ్ల పాటు పీఎస్‌గా పని చేసిన శ్రీనివాస్, లోకేశ్‌ స‌న్నిహితుడు కిలారు రాజేష్, వైఎస్సార్‌ జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డికి సంబంధించిన ఆర్కే ఇన్‌ఫ్రా, సబ్‌ కాంట్రాక్టర్‌ సుబ్బారెడ్డి,  మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శర్‌త్‌కు చెందిన అవెక్సా ఇన్‌ఫ్రాలలో గురువారం ఉదయం ఏకకాలంలో ఐటీ అధికారుల బృందాలు దాడులు ప్రారంభించాయి.

 

అగ్రిగోల్డ్ భూ దందాతో పాటు మంత్రిగా ఉన్న సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్గడి పలు అక్రమ వ్యాపారాలు చేసినట్టుగా ప్రత్తిపాటిపై ఆరోపణలు ఉన్నాయి. రైతుల దగ్గర చిరు ధాన్యాలను తక్కువ రేటు కొని వారిని మోసం చేశాడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఆయన కొడుకు శరత్ అక్రమ సంపాదనలో తండ్రినే మించిపోయాడన్న ప్రచారం జరుగుతోంది.

 

శుక్రవారం కూడా కొనసాగిన ఈ దాడుల్లో ఐటీ అధికారులు పలు కీలక ఆధారాలను సేకరించార‌ని తెలుస్తోంది. ప్రభుత్వాన్ని మోసం చేసిన పనులు చేయకుడాంనే బిల్లుల రూపంలో డబ్బు, కమీషన్లు వసూళు చేసినట్టుగా ఆధారాలు లభించాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ దాడుల్లో ఐటీతో పాటు జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ విభాగం కూడా పాల్గొనటంతో టీడీపీ శ్రేణుల‌కు కంటి మీద కునుకు లేకుండా పోతోంది.

 

ఈ దాడులకు గతంలో చాలా ఏళ్ల క్రితం ముంబైలో జరిగిన ఐటీ దాడులకు సంబంధాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అప్పట్లో ఓ బ‌డా కాంట్రాక్ట‌ర్ సంస్థ కార్యాల‌యాల్లో జరిగిన ఐటీ సోదాల్లో మ‌న రాష్ట్రానికి చెందిన ముఖ్య‌నేత‌కు రూ.150 కోట్ల‌కు పైగా ముడుపులు అందిన విష‌యం బ‌య‌ట‌ప‌డింది. ఈ విష‌యాన్ని అధికారులు అధికారికంగానే వెల్ల‌డించారు. ఆ కేసుకు ప్రస్తుత దాడులకు సంబంధం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుండటంతో తెలుగు తమ్ముళ్లలో టెన్షన్‌ మరింత ఎక్కువవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: