కర్నూలు టీడీపీ మాజీ మేయర్, సీనియర్ నేత బంగి అనంతయ్య ఆత్మహత్యాయత్నం జిల్లాలో కలకలం రేపింది. ఈరోజు ఆయన తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. కూరగాయల కోసం భార్య, కూతురు మార్కెట్ కు వెళ్లిన సమయంలో ఆత్మహత్యాయత్నం చేసినట్టు సమాచారం. టీడీపీలో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ... రాజకీయంగా అందరూ తనను మోసం చేశారని ప్రాణాలు తీసుకునేందుకు ప్రయనించినట్టు తెలుస్తోంది. 
 
స్థానికులు గమనించి అనంతయ్యను కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. అనంతయ్య ఆత్మహత్యాయత్నం చేశారనే వార్త టీడీపీ నేతలను కలవరపెడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో బంగి అనంతయ్య అందరికీ సుపరిచితం. ప్రత్యేక హోదా, సమైక్యాంధ్ర ఉద్యమాల్లో అనంతయ్య పాల్గొన్నారు. 
 
వినూత్నమైన పద్దతుల్లో ప్రజా సమస్యలపై నిరసనలు తెలియజేస్తూ వార్తల్లో నిలిచారు. గతంలో అనేక సందర్భాల్లో ప్రభుత్వ విధానాలను బంగి అనంతయ్య విచిత్ర వేషధారణలతో ఎండగట్టారు. అనంతయ్య ఆత్మహత్యాయత్నానికి ఆర్థిక ఇబ్బందులు కూడా కారణమని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. స్థానికంగా అనంతయ్య ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతోంది. 
 
పార్టీలో పదవులు ఇవ్వలేదని అనంతయ్య మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 2019 ఎన్నికల ఫలితాలలో కర్నూలు జిల్లాలో వైసీపీ ఘనవిజయం సాధించింది. టీడీపీ జిల్లాలో ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేదు. ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీలో తగిన గుర్తింపు లేకపోవడంతో అనంతయ్య ఆత్మహత్యాయత్నం చేసినట్టు ప్రచారం జరుగుతోంది. కర్నూలు టీడీపీ ముఖ్య నేతలు ఆస్పత్రికి చేరుకుని అనంతయ్య ఆరోగ్య పరిస్థితిని ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు అనంతయ్య కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ధైర్యం చెప్పినట్టు సమాచారం అందుతోంది.                       

మరింత సమాచారం తెలుసుకోండి: