ఇండియాలో లాక్ డౌన్ మరో రెండు వారాలు పొడిగించారు. అయితే కాస్త ఆలస్యంగానైనా లాక్ డౌన్ ఎత్తేయాల్సిందే. అప్పుడు విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి తరచూ రాకపోకలు ఉంటాయి. ఈ విషయంపై ఏపీ సీఎం జగన్ ముందు చూపుతో ఉన్నారనే చెప్పాలి. లాక్ డౌన్ అనంతరం రాష్ట్రానికి విదేశాలు, పలు రాష్ట్రాల నుంచే వారికోసం పెద్దఎత్తున క్వారంటైన్ కేంద్రాలుసిద్దం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు.

 

 

అప్పటికప్పుడు హడావిడి పడకుండా దీని కోసం సమగ్ర కార్యాచరణ సిద్దం చేయాలని జగన్ అధికారులను ఆదేశించారు. లాక్‌డౌన్‌ సడలింపు తో విదేశాలు, ఇతరరాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున స్వస్థలాలకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసి.. వారిపట్ల తీసుకోవాల్సిన చర్యలపై సీఎం చర్చించారు. వారికి స్క్రీనింగ్‌ సహా అవసరమైన వారిని క్వారంటైన్‌కు తరలించడం తదితర అంశాలపై చర్చించారు. విదేశాలనుంచి వచ్చే వారికి దాదాపుగా నాన్‌ కోవిడ్‌ సర్టిఫికెట్‌ ఉంటుందని, వారికి హోం క్వారంటైన్‌ విధిస్తామని అధికారు చెప్పారు.

 

 

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించి పరీక్షించాక కరోనా లేదని తేల్చాకే ఇళ్లకు పంపుతామని అధికారులు తెలిపారు. అయితే దీనికోసం అనుసరించాల్సిన విధానంపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం జగన్ ఆదేశించారు. క్వారంటైన్లో అందించాల్సిన సదుపాయాలు, వసతిపై ఇప్పటినుంచే దృష్టిపెట్టాలని సూచించారు. క్వారంటైన్‌ కేంద్రాల్లో సదుపాయాలు, పారిశుద్ధ్యం, భోజనం తదితర అంశాలపై నిరంతరం పర్యవేక్షించాలని చెప్పిన సీఎం.. అందుకోసం సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి కృష్ణబాబుకు బాధ్యతలు అప్పగించారు.

 

ప్రస్తుతం కొనసాగుతోన్న కొన్నిక్వారంటైన్ కేంద్రాల్లో సదుపాయాలపై ఫిర్యాదులపైనా జగన్ దృష్టి సారించారు. పారిశుద్ధ్యం, సదుపాయాలు, భోజనం, మందులు అందుతున్నాయా లేదా అనే విషయమై క్వారంటైన్లో ఉన్నవారి నుంచి ఎప్పటికప్పుడు అభిప్రాయాలు తీసుకుంటున్నామని అధికారుల చెప్పారు. క్వారంటైన్‌ కేంద్రంలో ఉన్న ప్రతి ఒక్కరి మొబైల్ కు కమాండ్‌ కంట్రోల్‌ నుంచి ర్యాండమ్‌గా కాల్‌చేసి వారి అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నామని సీఎంకు తెలియజేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: