రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజుల నుంచి కర్నూలు జిల్లా హాట్ టాఫిక్ గా మారింది. జిల్లాలో కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 500కు చేరువ కావడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలోని కర్నూలు, నంద్యాల ప్రాంతాల్లోనే అధిక సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఈ రెండు ప్రాంతాల్లోనే దాదాపు 370 కేసులు నమోదు కావడం గమనార్హం. 
 
జిల్లాలో కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో అధికార పార్టీపై ప్రతిపక్షాలు సైతం విమర్శలకు దిగుతున్నాయి. కర్నూలు జిల్లాలో కేసుల సంఖ్య పెరగడంపై సీఎం జగన్ సీరియస్ అయ్యారని వార్తలు వచ్చాయి. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో పోలీసులు నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మినహా అనవసరంగా రోడ్లపైకి రావొద్దని వాహనదారులను హెచ్చరిస్తున్నారు. 
 
నిబంధనలు పదేపదే ఉల్లంఘిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. జిల్లాలో నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై పోలీసులు 66,328 కేసులు నమోదు చేశారు. జిల్లాలో 9913 వాహనాలు సీజ్ చేశారు. పోలీసులు నిబంధనలు పాటించని 843 మందిని అరెస్ట్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించని వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు చెబుతున్నారు. 
 
కర్నూలు జిల్లాలో నిన్నటివరకు 466 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న నమోదైన కేసుల్లో కర్నూలులో 28 కేసులు నమోదు కాగా కోడుమూరులో రెండు కేసులు నమోదయ్యాయి. గడచిన 10 రోజుల్లో రాష్ట్రంలో 232 కరోనా కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ఇప్పటివరకు 77 మంది కరోనా వైరస్ ను జయించి ఇళ్లకు వెళ్లారు. జిల్లాలో కరోనా భారీన పడి ఇప్పటివరకు పది మంది మృతి చెందారు. ఏపీ ప్రభుత్వం జిల్లాలో కేసుల సంఖ్య పెరగడంతో కొన్ని రోజుల క్రితం ఒక అధికారిపై బదిలీ వేటు వేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: