తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ ను వైరస్ భయపెడుతోంది. అవసరమైతే రాజధానిలో మళ్లీ లాక్ డౌన్ విధించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ విషయంలో 2,3 రోజుల్లో క్యాబినెట్ సమావేశం ఉంటుందని ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటించారు. అటు రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీకి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. 

 

భాగ్యనగరంలో కరోనా విలయతాండవం చేస్తోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో పూర్తి లాక్‌డౌన్ చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆయనను అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డాక్టర్ల పర్యవేక్షణలో హోంమంత్రికి వైద్యం అందిస్తున్నారు. మూడురోజుల క్రితమే మహమూద్‌ అలీ టెస్టులు చేయించుకున్నారు. అస్తమా ఉండటంతో ముందుగానే కుటుంసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు.

 

హైదరాబాద్‌లో మరోసారి లాక్‌డౌన్‌ విషయంపై లోతుగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌. లాక్‌డౌన్‌ ఏ విధంగా విధించాలి అన్నదానిపై రెండుమూడు రోజుల్లో కేబినెట్‌ పెట్టి నిర్ణయిస్తామని చెప్పారు.

 

తెలంగాణలో కరోనా మరణాల శాతం చాలా తక్కువగా ఉందని ఈటల రాజేందర్  తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో చాలా వరకు కరోనా కట్టడి అయ్యిందని, ఒక్క హైదరాబాద్‌లోనే కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. పరీక్షల కోసం స్పెషల్ సెంటర్స్ పెట్టామని, మంగళవారం నుంచి విస్తృతంగా పరీక్షలు చేస్తామని చెప్పారు. కరోనా రోగులకు సరైన చికిత్స అందడంలేదన్నది అవాస్తవమని ఈటల అన్నారు. వారం రోజుల్లో 10వేల బెడ్స్‌ అందుబాటులోకి వస్తాయని మంత్రి ఈటల తెలిపారు. 

 

కరోనా కేసులు పెరుగుతుండటంతో రాష్ట్రంలో కిరాణం దుకాణాలు,  వ్యాపార సంస్థల నిర్వాహకులు వేళల విషయంలో నియంత్రణ పాటిస్తున్నాయి. సాయంత్రం ఐదారు గంటల వరకే షాపులను తెరుస్తున్నారు. కొన్నిచోట్ల మధ్యాహ్నానికే బంద్‌ చేస్తున్నారు. ఇంకొన్నిచోట్ల సంపూర్ణ బంద్‌ పాటిస్తున్నారు. హైదరాబాద్ బేగంబజార్లో 20మందికి పైగా కరోనా సోకడం, వారిలో ముగ్గురు మృతిచెందడంతో వ్యాపార కార్యకలాపాలు మూతపడ్డాయి. ఆల్వాల్‌లో సోమవారం నుంచి జూలై 6వ తేదీ దాకా స్వచ్చందంగా లాక్‌డౌన్‌ పాటించాలని వ్యాపారులు నిర్ణయించారు. ఎర్రగడ్డ రైతుబజార్‌లో సోమవారం నుంచి స్వచ్ఛంద లాక్‌డౌన్‌ అమలవుతోంది. 

 

తెలంగాణలో కరోనా పరిస్థితి, రాష్ట్ర సర్కారు తీసుకుంటున్న చర్యలను క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసేందుకు ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర బృందం  సోమవారం గచ్చిబౌలిలోని టిమ్స్‌ ఆస్పత్రిని పరిశీలించింది. కరోనా నివారణ చర్యలపై ఆరా తీసింది. అనంతరం గాంధీ ఆస్పత్రి ల్యాబ్‌ను కూడా  కేంద్ర బృందం పరిశీలించింది. మధ్యాహ్నం కంటైన్‌మెంట్‌ దోమలగూడ దోబీగల్లీలో పర్యటించింది. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై సమీక్షించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: