వైసిపి రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం ఎవరికీ ఒకపట్టాన అర్థం కావడం లేదు. కానీ వైసిపికి మాత్రం ఆయన పెద్ద తలనొప్పిగా మారారు. నిత్యం ఏదో ఒక అంశంపై ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, ప్రతిపక్షాలను మించిన స్థాయిలో ఆయన వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు జగన్ ను గాని, వైసీపీ ని కానీ ఎవరు ధైర్యం చేసి ఘాటు వ్యాఖ్యలు చేసేందుకు ముందుకు రాలేదు. కానీ రఘురామకృష్ణరాజు మాత్రం తాను ఎవరికీ భయపడే రకం కాదని, తన విమర్శలు ఎప్పుడూ ఇలాగే కొనసాగుతాయి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మొదట్లో బీజేపీ వైపు వెళ్లేందుకు ఇలా మాట్లాడుతున్నారని అంతా అనుకున్నా, బిజెపి ఇప్పుడు జగన్ వైపు చూస్తూ ఉండడం, ఆ పార్టీతో పొత్తుకు ప్రయత్నించడం వంటి వ్యవహారాలతో రఘురామ కృష్ణంరాజు బిజెపిలో చేరడం అసాధ్యం అనే అభిప్రాయానికి అంతా వచ్చేశారు. 



ఎట్టి పరిస్థితుల్లోనూ బిజెపి వైపు రఘురామకృష్ణంరాజు వెళ్లారని అంతా అనుకుంటున్న సమయంలో, ఇప్పుడు మళ్లీ ఆ పార్టీ వైపు వెళ్లేందుకు రాజుగారు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తున్నారు. మొన్నటి వరకు వైసీపీ పై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వచ్చిన ఏపీ బీజేపీ నేతలు ఎవరూ ఇప్పుడు వైసీపీ పై విమర్శలు చేసేందుకు ఇష్టపడడం లేదు. సరిగ్గా ఇదే సమయంలో హిందుత్వ జెండాను రాజు గారు తెరపైకి తెస్తున్నారు. రచ్చ బండ పేరుతో వైసీపీ పై ప్రశ్నలు కురిపిస్తూ, విమర్శలు చేస్తూ వస్తున్న ఆయన మరోసారి వైసీపీ ప్రభుత్వం పై క్రిస్టియానిటి కామెంట్స్ చేస్తున్నారు. ఏపీలో మతమార్పిడులు, క్రైస్తవ సంస్థల పెత్తనాలపై మాట్లాడుతున్నారు. 



హిందుత్వం విషయంలో సానుకూలంగా మాట్లాడుతూ, ఏదో ఒక రకంగా వైసీపీ పై బురద జల్లుతూ, అదే సమయంలో బిజెపి దగ్గర మార్కులు కొట్టేసేందుకు రఘురామకృష్ణంరాజు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తున్నారు. కానీ జగన్ స్నేహం కోసం ఎదురు చూపులు చూస్తున్న బిజెపి రాజు గారి పై కరుణ చూపించడం కష్టమే అన్నట్టుగా పరిస్థితి కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: