ఏపీలో టీడీపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా చంద్రబాబు పావులు కదుపుతున్నారు. ఎన్నికల్లో ఘోర ఓటమి నుంచి బయటపడేందుకు కష్టపడుతున్నారు. పార్టీ నేతలని యాక్టివ్ చేసి అధికార వైసీపీకి ధీటుగా ఉండేందుకు చూస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల పార్లమెంట్ స్థానాల వారీగా అధ్యక్షులని నియమించారు. ఇంకా పార్టీలో కీలక పదవులని భర్తీ చేశారు.

అయితే టీడీపీలో పదవుల పంపకం జరిగాక, పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహం వచ్చింది. పైగా అచ్చెన్నాయుడు ఏపీ అధ్యక్షుడు కావడంతో, కాస్త సమీకరణలు మారాయి. నేతలు దూకుడు ప్రదర్శించటం మొదలుపెట్టారు. కొత్త పార్లమెంట్ అధ్యక్షులు సైతం అసెంబ్లీ నియోజకవర్గాల్లో తిరుగుతూ, నేతలని యాక్టివ్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. కాకపోతే పార్లమెంట్ అధ్యక్షులంతా యాక్టివ్‌గా ఉన్నట్లు కనిపించడం లేదు.

కొందరు అధికార వైసీపీ దెబ్బకు చేతులెత్తేస్తున్నట్లు కనిపిస్తోంది. వైసీపీ డామినేషన్ ఏరియాల్లో పూర్తిగా టీడీపీ నేతలు తిరగడం లేదు.
ముఖ్యంగా వైసీపీ హవా ఉండే రాయలసీమలో టీడీపీ అధ్యక్షులు కనిపించడం లేదు. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో రెండు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. చిత్తూరుకు పులివర్తి నాని, తిరుపతికి నరసింహ యాదవ్ అధ్యక్షులుగా ఉన్నారు. వీరు కాస్త పర్వాలేదనిపించేలా పనిచేస్తున్నారు.

అటు అనంతపురంలో హిందూపురం అధ్యక్షుడు పార్థసారథి, అనంత అధ్యక్షుడు కాల్వ శ్రీనివాసులు కాస్త దూకుడుగానే ఉన్నారు. ఇక కర్నూలు జిల్లాలో నంద్యాల అధ్యక్షుడు గౌరు వెంకట రెడ్డి, కర్నూలు అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు పెద్దగా ఫీల్డ్‌లో దిగినట్లు కనిపించడం లేదు. ఇక జగన్ సొంత జిల్లా కడపలో రాజంపేట అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, కడప అధ్యక్షుడు లింగారెడ్డిలు సైతం అంత ప్రభావంగా పనిచేయడం లేదని తెలుస్తోంది.

ఇక మూడు రాజధానులు ప్రభావం ఉన్న ఉత్తరాంధ్రలో సైతం టీడీపీ అధ్యక్షులు చేతులెత్తేసినట్లు కనబడుతోంది. ఒక్క శ్రీకాకుళంలోనే టీడీపీ ఫుల్ యాక్టివ్‌గా ఉండగా, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో అంత ప్రభావం చూపడం లేదు. మొత్తానికైతే రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో టీడీపీకి గట్టి దెబ్బ తగిలేలా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: