ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ కూ ఏపీ సర్కారుకు ఉన్న గొడవల సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణతో మొదలైన ఈ జగడం ఆయన్ను పదవి నుంచి దించే వరకూ.. ఆ తర్వాత మళ్లీ ఆయన పదవిలోకి వచ్చే వరకూ ఎన్నో ట్విస్టుల మీద ట్విస్టులు.. మళ్లీ ఇప్పుడు ఆయన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ వైపు మొగ్గుచూపుతుండటంతో మళ్లీ వివాదాలు మొదలయ్యాయి. ఈ అంశంపై ఈనెల 28న రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేశారు కూడా. ఈ సమయంలో ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా ఉన్న అధికారి కార్యాలయం నుంచి వెళ్లిన ఓ లేఖ కలకలం సృష్టిస్తోంది.

త్వరలో జరగనున్న పార్లమెంటు ఉప ఎన్నికలు, శాసనమండలి ఉప ఎన్నికలు, స్థానికసంస్థల ఎన్నికలపై చర్చించేందుకు ఈ నెల 26న సీఎం క్యాంపు కార్యాలయం మొదటి అంతస్తులో ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ఒక సమావేశం నిర్వహిస్తున్నారని, దానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ హాజరవ్వాలని ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్‌ నిమ్మగడ్డకు లేఖ పంపారు. దీంతో నిమ్మగడ్డ ఒక్కసారిగా ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే.. ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అంటే..  హైకోర్టు న్యాయమూర్తితో సమానమైన హోదా కలిగిన రాజ్యాంగబద్ధమైన పదవి.

అలాంటి పదవిలో ఉన్న తనకు..  సర్వీసులో ఆయన కంటే చాలా జూనియర్‌ అయిన ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఓ మీటింగు రమ్మని పిలవడం ఏంటి.. అన్నది నిమ్మగడ్డ లా పాయింటు.. అందుకే ఆయన మరింత ఘాటుగా ప్రవీణ్ ప్రకాశ్ కు తిరుగు సమాధానం పంపించారట. నిమ్మగడ్డ తన వ్యక్తిగత కార్యదర్శి ద్వారా, ప్రవీణ్‌ ప్రకాష్‌ కార్యాలయానికి ఒక లేఖ పంపించారు.

అందులో ఏముందంటే..  ‘‘మీరు పంపించిన వర్తమానాన్ని ఎన్నికల కమిషనర్‌ దృష్టిలో ఉంచాను. దానిపై ఆయన ఆదేశం మేరకు మీకు ఈ ప్రత్యుత్తరం పంపిస్తున్నాం. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పోస్టు రాజ్యాంగబద్ధ పదవి. హైకోర్టు జడ్జితో సమానహోదా గల పదవిలో ఉన్న ఎన్నికల కమిషనర్‌కి.. ఒక సమావేశానికి హాజరవ్వాలని ఇలా హుకుం జారీ చేయడం తీవ్ర అభ్యంతరకరం, అసంబద్ధం. అది బెదిరింపు ధోరణిలా ఉంది. మీ వైఖరి ఎన్నికల కమిషన్‌ స్వతంత్రతకు, సమగ్రతకు భంగం కలిగించడమే. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై దాఖలైన పిటిషన్‌ ప్రస్తుతం హైకోర్టు విచారణలో ఉంది. అలాంటి సమయంలో ఎన్నికల కమిషన్‌ను ప్రభావితం చేసేలా వ్యవహరించిన మీ తీరును హైకోర్టు దృష్టికి తీసుకెళతాం.. అని లేఖలో తెలిపారు. అంతే కాదు.. ఎన్నికలకు సంబంధించి నిర్వహించే ఏ సమావేశాలకూ తన అనుమతి లేకుండా వెళ్లవద్దంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శినీ నిమ్మగడ్డ ఆదేశించారు. మొత్తానికి మరోసారి నిమ్మగడ్డ హైకోర్టుకు వెళ్లేలా ఉన్నారుగా. 

మరింత సమాచారం తెలుసుకోండి: