రాజకీయాల్లో ఎత్తులు ఉంటాయి. వాటికి ఢీ కొట్టే పై ఎత్తులు కూడా ఉంటాయి. ఎదుటివారు ఒకటి అనేలోపు పది అనేవాడే రాజకీయంగా బహు మొనగాడు అవుతాడు. ఏపీ రాజ‌కీయాల్లో చూసుకుంటే అటు యువకుడు అయిన జగన్ ఉంటే ఇటు రాజకీయంగా తల పండిన చంద్రబాబు ఉన్నారు. ఇద్దరి రాజకీయాలు వేరు, వ్యూహాలు కూడా వారు. దాంతో ఏపీలో రాజకీయం చదరంగాన్నే తలపిస్తుంది.

జగన్ ఏపీలో చేతికి ఎముక లేదన్నట్లుగా సంక్షేమ పధకాలను అమలు చేస్తున్నారు. దాని కోసం ఆయన లక్షల కోట్ల అప్పులు కూడా తెచ్చి మరీ జనం ఖాతాల్లో సొమ్ము వేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే దేశంలో ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పధకాలు ఎక్కడా జరగవు అనవచ్చు. దానికి జగన్ కి నూరు మార్కులు వచ్చేస్తాయి.

కానీ అదే సమయంలో జగన్ మరచినది ఒకటి ఉంది. అదే అభివృద్ధి. దేశంలో ఎక్కడైనా అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్ళుగా భావిస్తారు. రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి. లేకపోతే ప్రగతి రధం కుంటుతుంది. ఈ రోజు పరమాన్నం వండుకు తిన్నామని కాదు రేపటి రోజున అభివృద్ధి కూడా అవసరం.

అయితే అభివృద్ధి విషయంలో జగన్ సర్కార్ కి మార్కులు పెద్దగా పడడంలేదు ఆ మాటకు వస్తే అభివృద్ధి పడకేసింది అని కూడా కామెంట్స్ వచ్చి పడుతున్నాయి. దాంతో జగన్ ని అభివృద్ధి మంత్ర దండం తో గట్టి  దెబ్బ కొట్టాలని చంద్రబాబు పక్కాగా స్కెచ్ వేసుకున్నారు అంటున్నారు. తన పాలనలో తప్ప అసలు వైసీపీ ఏలుబడిలో ఏపీలో అభివృద్ధి ఎక్కడైనా ఉందా అంటూ రానున్న ఎన్నికల్లో చంద్రబాబు  గళం విప్పబోతున్నారుట.  తిరుపతి ఉప ఎన్నికతో పాటు, లోకల్ బాడీ ఎన్నికల్లోనూ ఇదే అస్త్రంతో బాబు యుద్ధ రంగాన దిగుతారు అంటున్నారు. హిట్ అయితే బాబుకు ఎదురులేనట్లే. మరి అభివృద్ధి విషయం జనంలో చర్చకు వస్తే జగన్ సర్కార్ ఏ విధంగా సమాధానం చెబుతుంది అన్నది కూడా చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: