ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం  ఢిల్లీ బ‌య‌ల్దేరి వెళ్లనున్నారు. ముఖ్య‌మంత్రి తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి గర్నవర్‌ ఎయిర్‌పోర్టుకు వెళ్లనున్నారు. అక్కడి నుంచి ఢిల్లీ బయలుదేరుతారు. అమిత్ షాతో పాటు ప‌లువురు కేంద్ర మంత్రులతో ఆయ‌న భేటీ కానుండ‌టం ఆస‌క్తి రేపుతోంది. ప్ర‌ధానంగా అమిత్ షాతో భేటీ జ‌ర‌గ‌డంపై అటు బీజేపీ ఇటు వైసీపీ వ‌ర్గాల్లోనూ ఆస‌క్తి నెల‌కొంది. గ‌త కొద్ది రోజులుగా రాష్ట్రంలో నెలకొంటున్న పరిణామాలపైనే ప్ర‌ధానంగా అమిత్‌షాకు ముఖ్యమంత్రి వివ‌రించినున్న‌ట్లు స‌మాచారం. ఏపీలో ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసంపై రాజకీయ దుమారం రేగుతోంది. దీనిపై ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.


ఈ క్రమంలో ఏపీలో నెలకొన్న పరిస్థితులపై హోంమంత్రి అమిత్ షాకు జగన్ వివరించనున్నట్లు తెలుస్తోంది. విగ్రహాల ధ్వంసం వెనక రాజకీయ కుట్ర ఉందని నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం. మరోవైపు ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌తోనూ భేటీ అవుతారని తెలుస్తోంది. పెండింగ్‌ నిధులతో పాటు ప్రాజెక్టులు పూర్తయ్యేలా బడ్జెట్‌లో నిధులను కేటాయించాలని ఆర్థికశాఖ మంత్రిని జగన్‌ కోరే అవకాశం ఉంది. మొత్తం మీద జగన్‌ ఆకస్మిక ఢిల్లీ పర్యటనపై ఏపీ రాజకీయాల్లో హట్‌ టాపిక్‌గా మారింది. ఇదిలా ఉండ‌గా బీజేపీ రామ‌తీర్థం నుంచి తిరుప‌తి వ‌ర‌కు పాద‌యాత్ర చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించిన విష‌యం విదిత‌మే.


ఈక్ర‌మంలోనే  దేవాలయాలపై దాడులు.. విగ్రహాల ధ్వంసం ఘటనలపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఈ వ్యవహారంలో అసలు ముద్దాయి ప్రభుత్వమేనంటున్నాయి విపక్షాలు.. ఇటీవల జరుగుతున్న పరిణామాలు, రాజకీయ కుట్ర ఉందంటూ డీజీపీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో విపక్షాలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేస్తుంటే.. సీఎం జగన్‌ చోద్యం చూస్తున్నారని మాజీమంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. 150 దాడులు, ధ్వంసాలు జరిగేదాకా ఉదాసీనంగా ఉన్నారని ఆరోపించారు. సీఎం జగన్‌ డైరెక్షన్‌లో డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతున్నారని తప్పుబట్టారు. దాడులను ఆపలేక టీడీపీ నేతలపై బురద జల్లుతున్నారని దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: