నేటి సమాజంలో వాట్సప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు అందరు వాట్సప్ ని వాడుతూనే ఉన్నారు. ఇక ప్రముఖ మెసెంజర్ యాప్ వాట్సాప్ నూతన ప్రైవసీ పాలసీని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కొత్త నిబంధనలకు ఒప్పుకోకుంటే వాళ్ల వాట్సాప్ అకౌంట్ తొలగిస్తామని ప్రకటించింది. దీంతో ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు భారత ప్రభుత్వం గట్టి వార్నింగ్ ఇచ్చింది. వెంటనే కొత్త ప్రైవసీ పాలసీని ఉపసంహరించుకోవాలని స్పష్టం చేసింది. భారత యూజర్ల ప్రైవసీని గౌరవించాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ వాట్సాప్ సీఈవో విల్ కాత్‌కార్ట్‌కు లేఖ రాసింది.

ఈ కొత్త పాలసీని అంగీకరించండి లేదంటే వాట్సాప్‌ను వదులుకోండి అన్న వాట్సాప్ సందేశాన్ని ప్రభుత్వం తీవ్రంగా తప్పుబట్టింది. ఈ సందర్భంగా జస్టిస్ కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (2017) కేసును ప్రస్తావించింది. ప్రైవసీ, అంగీకార సూత్రాలకు విలువ ఇవ్వాలని ఈ తీర్పు స్పష్టంగా చెప్పిందని, దానిని మీరు గమనించాలని వాట్సాప్‌కు స్పష్టం చేసింది. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లకు ఇండియాలో చాలా మంది యూజర్లు ఉన్నారని, ఇప్పుడీ రెండింటి యూజర్ల డేటాను సేకరిస్తే అది దేశంలోని చాలా మంది పౌరుల ప్రైవసీకి భంగం కలిగించినట్లే అవుతుందని ఆ లేఖలో ఐటీ శాఖ అభిప్రాయపడింది

అయితే ఓ వ్యక్తి వాట్సాప్ ప్రైవసీ పాలసీపై ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన హైకోర్టు కొత్త పాలసీ నచ్చకపోతే సదరు యాప్ ను వాడకపోవడం ఉత్తమమని హైకోర్టు వ్యాఖ్యానించింది. మనం తెలయకుండానే చాలా యాప్ లు ఇన్ స్టాల్ చేసుకునేటప్పుడు వాళ్ల నిబంధనలకు ఓకే చెబుతామని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో వినియోగదారులు ఎంతో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అయితే వాట్సాప్ తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల చాలా మంది వాట్సాప్ కు ప్రత్యామ్నాయంగా సిగ్నల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: