బెంగళూరు: దేశ వ్యాప్తంగా 3 రోజులుగా కరోనా టీకా పంపిణీ కార్యక్రమం శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే లక్షల మందికి వ్యాక్సిన్ అందజేశారు. ఈ వ్యాక్సిన్ అందజేత కార్యక్రమాన్ని దేశ, విదేశాలతో పాటు డబ్ల్యూహెచ్‌ఓ కూడా ప్రశంసించింది. కోవిడ్ నిర్మూలనలో భారత్‌ అద్భుతంగా వ్యవహరిస్తోందని, ఆ దేశం పనితీరు భేష్ అని అభినందిస్తోంది. కానీ కేరళకు సంబంధించిన రెసిడెన్షియల్ డాక్టర్లు మాత్రం వ్యాక్సిన్ పంపిణీని తప్పు బడుతూ సంచలన ఆరోపణలు చేస్తున్నారు.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అందజేస్తున్న కోవిషీల్డ్, కొవ్యాగ్జిన్ వ్యాక్సిన్‌లు ఇంకా ట్రయల్స్‌ దశలోనే ఉన్నాయని, అలాంటి వ్యాక్సిన్లకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేయడం ఏంటని కర్ణాటక అసోషియేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్ల సంఘం ప్రశ్నించింది. పూర్తి స్థాయిలో తయారు కాని వ్యాక్సిన్లను ప్రజలకు ఇవ్వడం అంటే వారి ప్రాణాలతో చెలగాటం ఆడినట్లేనని, ఇలాంటి చర్యలకు కేంద్ర ప్రభుత్వం ఉపక్రమంచడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేసింది.

కరోనా వ్యాక్సిన్ పంపిణీపై కర్ణాటక అసోషియేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్ల సంఘం అధ్యక్షుడు మంగళవారం మీడియాతో మాట్లాడారు. కోవీషీల్డ్, కోవాగ్జిన్ టీకాలకు భారత ప్రభుత్వం అనుమతి ఇవ్వడం ఆందోళనకరమని, కోవాగ్జిన్‌ ఇంకా పూర్తి స్థాయిలో ట్రయల్స్ పూర్తి చేసుకోలేదని, ఆ వ్యాక్సిన్ ఇప్పటికీ మూడో దశ పరీక్షల స్థాయిలోనే ఉందని, అన్నారు. ఈ టీకా తీసుకున్న ఆరోగ్య కార్యకర్తలపై పరీక్షలు జరుగుతున్నాయని, కేంద్రం ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం సమంజసం కాదని, టీకా తీసుకోవాలా..? వద్దా..? అనే విషయం ఆరోగ్య కార్యకర్తల నిర్ణయానికే వదిలేయాలని, నిర్బంధం చేయకూడదని ఆయన డిమాండ్ చేశారు.

ప్రభుత్వ నిర్ణయాన్ని తాము ఖండిస్తున్నామని, ప్రభుత్వానికి ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తగవని ఆ సంఘ నేతలు అభిప్రాయపడ్డారు. టీకాపై అన్ని ట్రయల్స్ పూర్తయ్యాక కాకుండా ఇలా ట్రయల్స్‌లో ఉన్నప్పుడే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రజల ప్రాణాలు పోతే బాధ్యత ఎవరిదంటూ తీవ్రంగా విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: