భార‌త‌దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీకి భావోద్వేగ‌మ‌నేది అత్యంత స‌హ‌జ‌సిద్ధంగా కలుగుతుంది. భార‌తీయ జ‌న‌తాపార్టీలో కొత్త‌గా చేరేవారికి అవి కొత్త‌గా అనిపిస్తాయోమోకానీ ఎప్ప‌టినుంచో పార్టీలో ఉన్న‌వారికి మాత్రం ఆయ‌న భావోద్వేగాలు కొత్త‌గా అనిపించ‌వు. ప్ర‌ధాన‌మంత్రి ఎక్క‌డ స్వ‌రం త‌గ్గిస్తారో, ఎక్క‌డ పెంచుతారో, ఎక్క‌డ ఆవేశంగా మాట్లాడ‌తారో, ఎక్క‌డ గ‌ద్గ‌ద‌స్వ‌రం వినిపిస్తారో వారంద‌రికీ బాగా తెలుసు. తెలియ‌నిద‌ల్లా కొత్త‌వారికే. అందుకే మ‌న పెద్దోళ్లు అంటుంటారు ఎక్క‌డ నెగ్గాలోకాద‌ని, ఎక్క‌డ త‌గ్గాలో తెలిసిన‌వారే గొప్ప‌వార‌ని.

రెండు రోజుల క్రితం జరిగిన బిజెపి ఆఫీసు బేరర్ల సమావేశంలో ఆయన  రోజంతా పాల్గొని ఎంతో భావోద్వేగంతో మాట్లాడారు. తాను జీవితంలో ఎంత కష్టపడి పైకి వచ్చానో, పార్టీ కార్యకర్త నుంచి ప్రధానమంత్రి వరకూ రావడానికి మధ్య ఎన్ని ముళ్ల దారుల్ని అధిగమించానో ప్ర‌ధాన‌మంత్రి ఏక‌రువు పెట్టారు.  సాగు చట్టాలపై ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారం నమ్మకూడదని, గతంలో కూడా వాజపేయి హయాంలో ఇలాంటి ప్రచారం చేశారని మోడీ చెప్పారు.

కొత్తగా పార్టీలో చేరిన వారికి తప్ప ప్రధానమంత్రి ఉపన్యాసాలు తరుచూ వినే వారందరికీ ఆయన భావోద్వేగాలు కొత్తగా అనిపించవు. పార్టీలో కొత్తగా చేరిన వారికి మోదీ ఉపన్యాసం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ‘ఆయన మాలో ఒక కార్యకర్తగా కలిసిపోయి చాలా ఆత్మీయంగా మాట్లాడారు. కాంగ్రెస్ నాయకత్వానికీ, బిజెపి నాయకత్వానికీ చాలా తేడా కనిపించింది..’ అని కాంగ్రెస్ నుంచి బిజెపిలో చేరిన ఒక నేత చెప్పారు. మొత్తానికి కొత్తగా నియమితులైన ఆఫీసు బేరర్లందరూ మోదీ అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చారు. వ్యవసాయ, కార్మిక సంస్కరణలను ప్రవేశపెట్టినందుకు, అద్భుతమైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టినందుకు కరోనాను కట్టుదిట్టంగా ఎదుర్కొన్నందుకు వారు న‌రేంద్ర‌మోదీ సర్కార్‌ను అభినందిస్తూ రాజకీయ తీర్మానాన్ని ఆమోదించారు.
ప్రస్తుతం దేశంలో రగులుతున్న అంశాలపై ఎవరూ మాట్లాడలేదు. సమావేశంలో ప్రధాని మోదీదే ప్రధాన ప్రసంగం.  ప్రధానమంత్రి తన ప్రసంగంలో పార్టీ కార్యకర్తలే నిత్యం జనంలో ఉంటారని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల గురించి ప్రజలేమనుకుంటున్నారో వారికే ముందుగా తెలుస్తుందని చెప్పారుకానీ, జనం ఏమనుకుంటున్నారో ఆయన ఆఫీసు బేరర్ల ను అడిగి తెలుసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించ‌లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: