వారసత్వంగా వస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను నడపలేమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. ఆర్థికంగా ఎంతో నష్టం చేకూరుతోందని.. ప్రైవేటీకరించడమే మేలుగా భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. నష్టాల్లో ఉన్న అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజాధనంతో నడుస్తున్నాయని తెలిపారు. నాలుగు వ్యూహాత్మక రంగాలు మినహా మిగిలిన అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించేందుకు బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అస్సెట్ మేనేజ్‌మెంట్ (దీపమ్) ఆధ్వర్యంలో బుధవారం ప్రైవేటీకరణపై వెబినార్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. వ్యాపారం అనేది ప్రభుత్వ వ్యవహారం కాదన్నారు. వ్యాపార రంగానికి బీజేపీ ప్రభుత్వం తోడ్పాటును అందిస్తుందని.. ప్రభుత్వమే స్వయంగా వ్యాపారం చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమన్నారు. సంపద సృష్టి, ఆధునీకరణ దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతున్నామన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం వల్ల ఎన్నో సమస్యలు తొలుగుతాయన్నారు. ఈ విషయంలో ప్రజలు సుముఖత చూపాలన్నారు.

ప్రభుత్వ రంగం నుంచి వైదొలిగే రంగాలను ప్రైవేటు రంగ సంస్థ ఆధీనంలో కొనసాగుతాయన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ జరిగితే.. పెట్టుబడుల ఆకర్షణ, అభివృద్ధి జరుగుతుందన్నారు. వారసత్వంగా కొనసాగుతున్న ప్రభుత్వ రంగ సంస్థల వల్ల ప్రభుత్వానికి నష్టం చేకూరుతోందని, వీటిని స్థాపించినప్పటి నుంచి వ్యవస్థలో మార్పు రాలేదన్నారు. ఏళ్ల నాటి విధానాల్లో సంస్కరణలు అవసరమన్నారు. ప్రజాధనం సద్వినియోగమే లక్ష్యంగా సంస్కరణలు తీసుకొస్తున్నామని, దీని వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని ఆయన అభిప్రాయ పడ్డారు. కాగా, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడంపై కొన్ని చోట్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: