తెలంగాణ సీఎం కేసీఆర్ సిబ్బందిలో తాజాగా ఓ సంచనలం చోటు చేసుకుంది. సీఎం కేసీఆర్ స్వయంగా తన సొంత పీఆర్వోనే నిర్దాక్షిణ్యంగా తీసేశారు. సీఎం పీఆర్వో విజయకుమార్ అనూహ్య రీతితో ఉద్యోగం నుంచి తొలగించబడ్డాడు.. అయితే గౌరవం కోసం ముఖ్యమంత్రి పీఆర్వోగా రాజీనామా చేస్తున్నట్టు గటిక విజయకుమార్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. విజయ్ కుమార్ ను  పీఆర్వోగా మాత్రమేకాక ట్రాన్స్‌కో విభాగంలో జనరల్ మేనేజర్ పదవి నుంచి కూడా తొలగించారు.


విజయ్ కుమార్  తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ముఖ్యమంత్రి కార్యాలయంలో పీఆర్వోగా పనిచేస్తున్నారు. అలాంటి విజయకుమార్ హఠాత్తుగా రాజీనామా చేయడం వెనక కారణాలపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. పీఆర్వో హోదాను వాడుకుని సొంత ప్రయోజనాలు నెరవేర్చుకుంటున్నారన్న ఆరోపణ విజయ్ పై ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. విజయ్ కుమార్ గతంలో టీ న్యూస్‌లో పని చేశారు.


టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక సీఎం పీఆర్వో అయ్యారు. సాధారణగా కేసీఆర్ వైఖరి ఏంటో అందరికీ తెలిసిందే. అందులోనూ మీడియాలో ఉన్నవారికి కేసీఆర్ వ్యవహారశైలి తెలుసు. కేసీయార్ వంటి పాలకుడి దగ్గర పనిచేసినప్పుడు అత్యంత జాగరూకతతో పనిచేయడమే కాదు విధేయత కూడా చాలా ముఖ్యమన్న సంగతి విజయ్ కు తెలియంది కాదు.. కేసీయార్ పక్కనే రోజూ కనిపిస్తున్నా సరే, ఎంత అత్యంత కీలకమైన పొజిజన్‌లో ఉన్నాసరే..  తన వ్యవహార ధోరణిపై ఒక వేయి కళ్లు నిఘా వేస్తూ రోజురోజుకూ కేసీయార్‌కు సమాచారం చేరవేస్తాయనే విషయం విజయ్ కు కూడా తెలుసు.


మరి విజయ్ ఎందుకు ఆ విషయం తెలుసుకోలేకపోయాడన్నది అర్థంకాని విషయం. అయితే పీఆర్వో విజ‌య్  వ్యవ‌హార‌శైలి ఇటీవల బాగా మారిందని.. నేతలను సైతం లెక్క చేయడం లేదని.. సొంతపార్టీ గుట్టు బయటపెడుతున్నరని.. అనేక ఫిర్యాదులు వచ్చినట్టు తెలుస్తోంది.  పీఆర్వోగా తన పరిధిని దాటి ఇతర విషయాల్లో వేలు పెడుతున్నారని, కేటీఆర్‌కు సీఎం బాధ్యతలు అప్పజెప్పే విషయంలో విజయకుమార్ వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలు ఈ పరిస్థితికి కారణమనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి సీఎంకు అత్యంత దగ్గరగా ఉండే విజయకుమార్ రాజీనామా ఇప్పుడు ఆ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: