ఆంధ్రుల హ‌క్కుగా ఉన్న విశాఖ ఉక్కును ప్రైవేటు ప‌రం చేస్తుంటే ప్ర‌జ‌లు స‌హించ‌లేక‌పోతున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు, ప్ర‌జా సంఘాలు, కార్మిక సంఘాలు, పార్టీలు  దీనిపై వ‌రుస‌గా ఉద్య‌మాల‌కు శ్రీకారం చుడుతున్నాయి. వాస్త‌వానికి రాజ‌కీయ చైత‌న్యం కూడా ఇప్పుడు ఎంతో అవ‌స‌ర‌మ‌నే చెప్పాలి. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు అనే నినాదంతో మరో మారు ఉద్యమం మొదలైంది. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను ప్రతిపక్ష పార్టీ ఆయన టిడిపి అధికార పార్టీపై ఒత్తిడి తీసుకురావడానికి ఆయుధంగా వాడుకుంటుండగా, అధికార పార్టీ బీజేపీ-జనసేన లను కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని, కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైనది కాదు అంటూ టార్గెట్ చేస్తుంది.


 విశాఖ ఉక్కు -ఆంధ్రుల హక్కు’ – ఒకనాడు వెల్లువెత్తిన ప్రజల ఉద్యమ నినాదంగా ఇది సుపరిచితమే. పోలీసుల తుపాకి గుళ్లకు బలైన 32 మంది ప్రజల అమరత్వానికి గుర్తుగా సాగింది ఈ ఉద్య‌మం. ఈ ఉద్యమానికి ఐదేళ్ల క్రిత‌మే‌ అర్ధశతాబ్దం పూర్త‌యింది. 1966 నాటికి మనదేశంలో నాలుగే ఉక్కు కర్మాగారాలున్నాయి (రూర్కెలా, భిలాయ్‌, అసన్‌సోల్‌, బొకారో) 5వ ఉక్కు ఫ్యాక్టరీని మన రాష్ట్రంలోని విశాఖపట్నంలో పెట్టడానికి అన్నివిధాలా అనువైన ప్రదేశంగా పేర్కొంటూ 1963లోనూ 1965లోనూ నిపుణుల కమిటీ సిఫారసు చేసి వుంది. ఈ నేపథ్యంలో విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలని 1966 అక్టోబరు 15న గుంటూరు జిల్లా, తాడికొండకు చెందిన అమృతరావు అనే కాంగ్రెసు నాయకుడు నిరాహార దీక్ష ప్రారంభించాడు.


 రాష్ట్రమంతటా బంద్‌లు, హర్తాళ్‌లు, సమ్మెలతో హోరెత్తిపోతుంది. చాలాచోట్ల కాలేజీలు నిరవధికంగా మూసివేశారు. రాష్ట్రంలో అనేకచోట్ల నిరాహార దీక్షా శిబిరాలు వెలిశాయి. అంత‌టి గొప్ప పోరాటాల‌తోనే విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీని సాధించుకోగ‌లిగారు. ఇప్పుడు అదే స్ఫూర్తి కావాల‌ని ప్ర‌జా సంఘాల నాయ‌కులు ఆకాంక్షిస్తున్నారు.విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ప్రకటన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో దుమారం గా మారింది. ఒకపక్క టిడిపి ప్రైవేటీకరణను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమని, జగన్ మోహన్ రెడ్డి సీఎం గా ప్రైవేటీకరణ అడ్డుకోవడానికి చర్యలు తీసుకోవాలని, అవసరమైతే రాష్ట్ర విశాఖ ఉక్కు కర్మాగారం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: