కులం కూడు పెడుతుందా అని అంటారు. కానీ కులం చాలానే చేయిస్తుంది. కులంతో ఏం చేయించుకోవచ్చో రాజకీయ జీవులకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. కుల సమీకరణలతో ఎన్నికల సమరానికి తెర తీయడంతో రాజకీయ పార్టీలు అందె వేసిన చేయి. కులాలను కలుపుకుంటే ఓట్ల పంట పండుతుంది అన్న సత్యాన్ని బాగా తెలిసిన పార్టీలు ఇపుడు కుల సంకుల సమరానికే  రంగం సిధ్ధం చేశాయి.

విశాఖ జనాభా పాతిక లక్షలు, జీవీఎంసీ పరిధిలో 18 లక్షల దాకా ఓటర్లు ఉన్నారు. వీరిలో అన్ని వర్గాలా వారు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు. అయితే వీరిలో యాదవులు, కాపులు, గవరలు, బ్రాహ్మణులు, ముస్లింలు, మత్య్సకారులు బీసీలు ఇలా అన్ని రకాలైన కులాలు ఎన్నికల్లో విజయానికి కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి.  జీవీఎంసీని 98 వార్డులకు విస్తరించాక కులాల లెక్కలు మరింతగా పెరిగిపోయాయి.

దాంతో ప్రతీ రోజూ ఒక్కో కుల సంఘం సమావేశాన్ని ప్రధాన పార్టీల నేతలు నిర్వహించి వారిని మచ్చిక చేసుకుంటున్నారు. తాము గ్రేటర్ ఎన్నికల్లో గెలిసే ఏం చేస్తామో వారికి చెప్పి తమకు ఓటేయాలసిందిగా గట్టిగానే కోరుతున్నారు. ఈ కులాల సమీకరణల విషయంలో గతంలో తెలుగుదేశం పార్టీ ముందుంటే ఇపుడు మాత్రం వైసీపీ దూకుడు చేస్తోంది. చేతిలో అధికారం ఉండడంతో పెండింగులో ఉన్న సమస్యలను తీర్చడమే కాకుండా కొత్త హామీలను కూడా ఇస్తున్నారు.

ఇంకా ఏపీలో వైసీపీకి మూడున్నరేళ్ళ అధికారం ఉండడంతో కుల సంఘాల పెద్దలు కూడా అధికార పార్టీ వైపు మొగ్గు చూపడానికి చూస్తున్నారు. అలాగని టీడీపీకి కులాల మద్దతు లేదని భావించడానికి వీలు లేదు. గవరలు, యాదవులు  టీడీపీకి మొదటి నుంచి గట్టి మద్దతుదారులుగా ఉన్నారు. ఇక వైసీపీకి వెలమలు, మత్య్సకారులు, బీసీలు తమ మద్దతుని ప్రకటిస్తున్నారు. మొత్తానికి చూస్తేకులాల సమీకరణలు ఎవరికి అనుకూలంగా ఉంటే వారికే మేయర్ పీఠం దక్కుతుంది అని చెప్పాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: