మాజీ ముఖ్యమంత్రి సోదరుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనం రేపిన సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు  మరి కొన్నాళ్ళలో ఎన్నికలు వస్తాయనగా వివేకా హత్య జరిగింది. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం దర్యాప్తు జరిపినా హత్యకు కారణాలేమిటి ? ఎవరు హత్య చేశారు ? అనే విషయం తెలియలేదు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కూడా ప్రత్యేక దర్యాప్తు బృందాలు నియమించిన కేసులో చలనం లేకుండా పోయింది. 


అయితే వివేకానంద రెడ్డి కుమార్తె ఢిల్లీ దాకా వెళ్లి సిబిఐ చేత విచారణ జరిపించాలని కోరడంతో ఎట్టకేలకు సిబిఐ ఈ కేసును విచారిస్తోంది. గత కొద్ది రోజులుగా ఈ కేసు మీద ఫోకస్ పెట్టిన సిబిఐ కడప కేంద్రంగా విచారణ వేగవంతం చేసింది. కడపలో ఒక బృందం పులివెందులలో ఒక బృందం మొత్తంగా రెండు బృందాలు కలిసి విచారణ వేగంగా చేస్తున్నారు. అయితే పులివెందుల విచారణలో నేపథ్యంగా తెరమీదకు వైసీపీకి చెందిన కొందరు వ్యక్తుల పేర్లు వస్తున్నాయి.


 నిన్న కిరణ్ కుమార్ యాదవ్, సునీల్ అన్నదమ్ముల నివాసానికి వెళ్ళి కుటుంబ సభ్యులను అందరినీ విచారించింది సిబిఐ బృందం. వైసీపీకి చెందిన సునీల్, కిరణ్ అన్నదమ్ములు అప్పట్లో వివేకా దగ్గర సన్నిహితంగా వుండే వారని అంటున్నారు. అది కాక వివేకా హత్య జరిగిన ముందు రోజు ఆ ప్రాంతంలో ఎక్కువ సార్లు తిరిగిన కార్లు వివరాల పై కూడా ఆరా తీసింది సీబీఐ. రవాణశాఖ అధికారుల వద్ద సిబిఐ ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఓ కారుకు సంబందించి రవి అనే వ్యక్తి అలాగే అతని డ్రైవర్ గోవర్దన్ లను కూడా సిబిఐ విచారిస్తున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: