డెల్టా వైరస్.. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త రకం కరోనా వైరస్ ఇది. ఇప్పుడు ప్రపంచంలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వేరియంట్ ఈ డెల్టా.. ప్రపంచంలో వృద్ధి చెందుతున్న 75 శాతం కేసులకు ఈ ఒక్క వేరియంటే కారణమంటే ఇది ఏ రేంజ్‌లో వ్యాపిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే డెల్టా వేరియంట్ మరోసారి బ్రిటన్ కొంప ముంచుతోంది. బ్రిటన్‌ తో పాటు అనేక దేశాల్లో ఈ డెల్టా వేరియంట్‌  కేసులు బాగా పెరుగుతున్నాయి.


ఈ డెల్టా వేరియంట్ విస్తృతంగా వ్యాపిస్తున్న వల్ల.. బ్రిటన్ లో ప్రజలు మళ్లీ మళ్లీ కరోనా బారిన పడుతున్నారు. అందుకే బ్రిటన్‌ ప్రభుత్వం తమ దేశ పౌరులను కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇచ్చింది. దేశంలో ప్రతి ఒక్కరూ రెండు డోసులు తీసుకోవాలని సూచించింది. కొవిడ్  బారినపడి కోలుకున్న వారిలోనూ డెల్టా వేరియంట్ ప్రభావం చూపుతోందట. అందుకే రెండోసారి వైరస్  సోకే ప్రమాదం ఉందని అక్కడి అధికారులు వార్నింగ్ ఇస్తున్నారు.


ఈ డెల్టా వేరియంట్ ను అదుపు చేసేందుకు అక్కడి శాస్త్రవేత్తలు ప్రయోగాలు ముమ్మరం చేశారు. కరోనా ఆల్ఫా వేరియంట్‌తో పోలిస్తే డెల్టాతో రెండోసారి వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉందని.. దానిని త్వరగా గుర్తించేందుకు తమ విధానాలను ఆధునికీకరించామని చెబుతున్నారు. అంతే కాదు.. ఈ డెల్టా వేరియంట్‌ ను గుర్తించేందుకు అక్కడి జాతీయ నిఘా విశ్లేషణలో వయసు, టీకా పంపిణీ వంటి వాటిని కూడా  చేర్చారు.


ఈ డాటా ఆధారంగా డెల్టా వైరస్ ముప్పు పెరుగుతోందని గుర్తించారట. ఇంగ్లండ్‌లో మళ్లీ కేసులు పెరుగుతున్నందువల్ల అక్కడి ప్రభుత్వం జాగ్రత్త పడుతోంది. అన్ని వేరియంట్లపై వారం రోజులకోసారి పరిశీలన జరిపిస్తోంది. ఇంగ్లండ్‌లో గత వారంలో 33,716 డెల్టా కేసులు పెరిగాయట. దీంతో అక్కడ మొత్తం డెల్టా కేసుల సంఖ్య దాదాపు 3 లక్షలకు చేరింది. అంతేకాదు.. ఇటీవల నమోదైన 68,688 డెల్టా కేసుల్లో 897 మందికి రెండోసారి వైరస్ సోకినట్లు నిర్థరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: