ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన వెంటనే పది జిల్లాల తెలంగాణ మొత్తం 31 జిల్లాలు గా మార్చారు. తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నా మళ్లీ కొత్త జిల్లాల కోసం ప్రత్యేక ఉద్యమాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ క్రమంలోనే వరంగల్ జిల్లాలోని పరకాల - ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి తో పాటు ఈటెల రాజేందర్ ను ఓడించేందుకు హుజురాబాద్ ప్రత్యేక జిల్లా ఏర్పాటు అంశం తెర మీదకు వచ్చింది. కేసీఆర్ హుజురాబాద్ ప్రజలను తనవైపు తిప్పుకునేందుకు హుజురాబాద్ జిల్లా కేంద్రంపై హామీ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. కొద్ది రోజులుగా ప్ర‌త్యేక హుజూరాబాద్ జిల్లా అంశంపై చ‌ర్చ జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే.

స్థానికంగా ఉన్న కొందరు నేతలు కూడా ఇదే అదునుగా హుజురాబాద్ కొత్త జిల్లా డిమాండ్‌ తెరమీదకు తెస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న సత్తుపల్లి, అశ్వరావుపేట నియోజకవర్గాలను కలుపుతూ సత్తుపల్లి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని స్థానికంగా డిమాండ్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో స‌త్తుప‌ల్లి ఉండ‌గా... అశ్వరావుపేట భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నాయి. ఇక రజాకార్లను తరిమికొట్టిన పోరాటాల గడ్డ అయినా పర‌కాలను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని ప‌ర‌కాల‌ జిల్లా సాధన సమితి నేతలు డిమాండ్ చేస్తున్నారు.

ఇటీవల హనుమకొండ జిల్లా ఏర్పాటు చేసిన క్రమంలో పరకాల రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న ఆత్మకూరు, శాయం పేట మండలాల‌ను హనుమకొండ లో కలిపేసారు. దీంతో ప్రస్తుతం ప‌ర‌కాల‌ కేవలం రెండు మండ‌లా లతో కూడిన డివిజన్ గా ఉంది. ఇప్పుడు ప‌ర‌కాల రెవెన్యూ డివిజ‌న్ కూడా తీసేస్తారు అన్న వార్తల నేపథ్యంలో అక్క‌డ ప‌ర‌కాల‌ను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని స్థానికంగా పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఈ మూడు కొత్త జిల్లాల డిమాండ్లు ఇప్పుడు సీఎం కేసీఆర్‌కు పెద్ద తల నొప్పిగా ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: