కర్ణాటకలో కొద్ది రోజులుగా సాగుతున్న ఉత్కంఠ‌తో కూడిన నాటకీయ పరిణామాలకు బీజేపీ అధిష్ఠానం శుభం కార్డు వేసింది. ఆ రాష్ట్ర‌ ముఖ్యమంత్రి పదవికి బీఎస్ యడియూరప్ప రాజీనామా చేయాల‌ని క‌మ‌ల పెద్ద‌లు చెప్పిన త‌డువునే య‌డ్డీ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన తెల్లారే కొత్త సీఎం క్యాండిడేట్‌ ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది. సోమవారం యడియూరప్ప రాజీనామా చేయడం.. మంగళవారం కొత్త నాయ‌కున్ని ఎంపిక చేశారు. దీంతో బుధవారం క‌ర్ణాట‌క నూత‌న సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగానే రూపొందించుకున్న ప్రణాళిక ప్రకారం కొత్త సీఎం ఎంపిక ప్రశాంతంగానే ముగిసింది. యడ్డీ సన్నిహితుడు బసవరాజ బొమ్మైను ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారు.


దీంతో య‌డ్యూర‌ప్ప‌కు వ్య‌తిరేకంగా ఉన్న వ‌ర్గానికి స‌హించ‌డం లేదని తెలుస్తోంది. దీనికి కార‌ణం పదవి నుంచి దిగిపోయినా యడ్డీ తన పంతం నెగ్గించుకున్నార‌ని, త‌న సామాజిక వ‌ర్గం లింగాయత్ కు చెందిన వాడికే సీఎం పగ్గాలు అప్పగించారు. ఇదే సమయంలో యడియూరప్పను తొలగించామన్న సంతృప్తి ఆయన వ్యతిరేకులకు ఎంతో సేపు నిలువలేకుండా పోయింది. అధిష్ఠానం నుంచి యడియూరప్పకు మద్దతు లభించడం, కేవలం వయసుకు సంబంధించిన నిబంధనల కారణంగానే తప్పించాం తప్ఫ.. ఆయన నాయకత్వంపై ఎలాంటి వ్యతిరేకత లేదని బసవరాజ ఎంపికతో అధిష్ఠానం స్పష్టం చేయ‌డంతో వ్య‌తిరేక వ‌ర్గం మిన్న‌కుండిపోయింది.



రాష్ట్రంలో పార్టీకి సంబంధించి ప్రతి వ్యవహారం మాజీ ముఖ్య‌మంత్రి బి.ఎస్ యడియూరప్ప పర్యవేక్షణలో ఉండబోతుందని అరుణ్‌సింగ్‌ ప్రకటించడంతో వ్యతిరేకులకు క‌ళ్ల‌లో మంట పుడుతోంది. యడ్డీకి వ్యతిరేకంగా ఎందరో ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదులు చేసినా.. వాటిని పట్టించుకోకుండా సన్నిహితుడికే అధిష్టానం నాయకత్వ బాధ్యత అప్పగించటం గమనార్హం. య‌డ్డికి మానసపుత్రుడిగా చెప్పుకునే బసవరాజ కొత్త నేతగా ఎంపిక కావటం య‌డ్డ‌ప్ప‌ విజయంగానే భావిస్తున్నారు. ఓ విధంగా య‌డ్డీ చేతిలో  బసవరాజ బొమ్మయిపోతార‌ని  రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.


అయితే సీఎం పదవికి యడ్డీ జులై 10నే రాజీనామా చేసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అదే రోజున ప్రధాని మోదీకి య‌డ్యూర‌ప్ప‌ తన రాజీనామా లేఖను పంపారని ఆయ‌న‌కు సన్నిహితుడైన ఓ సీనియర్ నేత  తెలిపారు. ఇది జరిగిన ఆరు రోజుల అనంతరం కుమారులతో కలిసి య‌డ్డీ ఢిల్లీకి వెళ్లార‌ని పేర్కొన్నారు. ఆరోగ్య కారణాలతో య‌డ్యూర‌ప్ప త‌న‌ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు స్పష్టం చేశారని వివ‌రించారు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp