ఏపీలో ఆగస్ట్ 16నుంచి తరగతి గదుల్లో విద్యా బోధన చేపట్టేందుకు ప్రభుత్వం అన్నిరకాల ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే టీచర్లు రోజు మార్చి రోజు విధులకు హాజరవుతున్నారు. ఆగస్ట్ 15నాటికి మిగతా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి తరగతి గది బోధనకు రంగం సిద్ధం చేయాలనుకుంటున్నారు. అయితే ప్రస్తుతం మారుతున్న పరిస్థితులతో ఏపీలో స్కూల్స్ తెరిచేందుకు అవకాశం ఉందా లేదా అనేది అనుమానంగా మారింది.

కేరళలో రోజువారీ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో సగం కేరళనుంచే ఉంటున్నాయి. దీంతో కేరళలో రెడ్ అలెర్ట్ ప్రకటించింది ప్రభుత్వం. అటు కేంద్రం కూడా కేరళ వ్యవహారంపై ఓ కన్నేసింది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరగకపోయినా.. హైదరాబాద్ లో శ్వాస సమస్యలతో ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య పెరుగుతున్నట్టు చెబుతున్నారు. ఏపీ ప్రభుత్వం కూడా మూడో వేవ్ వస్తే ఎలా దాన్ని ఎదుర్కోవాలి అనే విషయంపై కసరత్తులు చేస్తోంది. ఆస్పత్రుల్లో మౌలిక సౌకర్యాలు, ఆక్సిజన్ లభ్యతపై దృష్టిపెట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. సాక్షాత్తూ ఏపీ డిప్యూటీ సీఎం కరోనా బారిన పడటంతో ఇక్కడ మరింత కలకలం రేగింది.

తల్లిదండ్రుల అభిప్రాయం ఏంటి..?
ప్రభుత్వం పిల్లల్ని స్కూళ్లకు రప్పించాలని చూస్తున్నా.. తల్లిదండ్రులు మాత్రం సుముఖంగా లేనట్టు తేలుతోంది. పిల్లలకు కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తయ్యేంత వరకు వారిని బడులకు పంపించేందుకు తల్లిదండ్రులు ఇష్టపడటం లేదని ఓ సర్వే తేల్చింది. లోకల్ సర్కిల్స్ అనే ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ నిర్వహించిన ఈ సర్వేలో 32వేల మంది తల్లిదండ్రులు తమ అభిప్రాయం చెప్పారు. వారిలో 48శాతం మంది తమ పిల్లలను స్కూళ్లకు పంపించేందుకు ఇష్టపడటంలేదు. పిల్లలకు కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చి, వారికి పూర్తిగా వ్యాక్సినేషన్ ఇచ్చిన తర్వాతే స్కూళ్లకు పంపిస్తామని చెబుతున్నారట.

ప్రస్తుతానికి ఆగస్ట్ 16నుంచి స్కూల్స్ తెరిచేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంటోంది. అయితే పక్షం రోజుల్లో ఏ నిర్ణయాలు ఎలా మారతాయో తెలియదు. తెలుగు రాష్ట్రాల్లో ఏమాత్రం కరోనా కేసులు పెరిగినా ప్రభుత్వ నిర్ణయం వాయిదా పడే అవకాశం ఉంది. ఒకవేళ కేసుల సంఖ్య నిలకడగా ఉంటే మాత్రం ఏపీలో ఆగస్ట్ 16నుంచి బడిగంట మోగినట్టే.

మరింత సమాచారం తెలుసుకోండి: