2022 లో జ‌ర‌గ‌బోయే గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌లు ప్ర‌ధాని మోడీకి స‌వాల్‌గా మారాయి.. ఎందుకంటే మోడీ సొంత రాష్ట్రం గుజ‌రాత్ లో గ‌త 20 ఏళ్లుగా బీజేపీ గెలుస్తూ వ‌స్తోంది. ఇందులో మోడీ నాలుగు సార్లు సీఎంగా ప‌ని చేశారు. ఆయ‌న హ‌యాంలో గుజ‌రాత్ అభివృద్ధిని చూసే మోడీ ప్ర‌ధాని అభ్య‌ర్థిగా అవ‌కాశం వ‌చ్చింద‌ని ఆ పార్టీ నేత‌ల విశ్వాసం. మోడీ ప్ర‌ధాని అయిన త‌రువాత కూడా గుజ‌రాత్‌లో బీజేపీ యే గెలుస్తోంది. అయితే, ఈ సారి జ‌రిగే ఎన్నిక‌లు మాత్రం న‌రేంద్ర మోడీకి స‌వాల్ కానుంది.


  2017 ఎన్నిక‌ల్లో 182 స్థానాల‌కు గాను బీజేపీ 99, కాంగ్రెస్ 66 స్థానాల్లో విజ‌యం సాధించాయి. అంటే బీజేపీకి కాంగ్రెస్ ఎలాంటి పోటీనిచ్చిందో తెలుస్తోంది. అనంత‌రం ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ తో కాంగ్రెస్ నాయ‌కుల‌ను బీజేపీలోకి చేర్చుకున్నారు. కానీ ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో బీజేపీకి వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయ‌నే చెప్పాలి.  క‌రోనా విష‌యంలో విఫ‌లం కావ‌డం, పాటిదార్లు మ‌రోసారి నిర‌స‌న గ‌ళ‌మెత్తేందుకు సిద్ధం అవుతుండ‌డంతో  అప్ర‌త్తమ‌యింది బీజేపీ.  ఈ క్ర‌మంలో పాటిదార్ల సామాజిక వ‌ర్గానికి చెందిన భూపేంద్ర ప‌టేల్‌ను సీఎంను చేసింది.


  మ‌రోవైపు గుజ‌రాత్‌లో ప‌ట్టు సాధించేందుకు  కాంగ్రెస్ వ్యూహాలు ర‌చిస్తోంది. బీజేపీకి కంచుకోటగా ఉన్న గుజరాత్ లో ఈ సారి కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు ఆ పార్టీ నాయకులు ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు. దీంట్లో భాగంగా కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ ఇప్పటికే ప్రణాళికల‌ను సిద్ధం చేస్తున్నారు. బీజేపీ వైపు అసంతృప్తిగా ఉన్న నేతలను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు చూస్తున్నారు. సీపీఐ (ఎం) యువ నేత కన్నయ్య త్వరలో కాంగ్రెస్ లోకి చేరే అవకాశం ఉంద‌ని ప్ర‌చారం న‌డుస్తోంది. అలాగే ఇండిపెండెంట్ గా గెలిచిన జిగ్నేష్ ను హ‌స్తం గూటికి చేర‌నున్న‌ట్టు తెలుస్తోంది.

     మోడీ స్వంత రాష్ట్రంలో బీజేపీ ఓడిపోతే ఆ ప్ర‌భావం పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌పై కూడా ప‌డ‌నుంది. దీంతో ఇప్ప‌టి నుంచే కాషాయ ద‌ళం గుజ‌రాత్ రాజ‌కీయాల్లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఎన్నిక‌ల వేళ మోడీ, అమిత్ షా కూడా రంగంలోకి దిగ‌నున్నార‌ని తెలుస్తోంది. ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌ర‌గ‌నున్న ఈ ఎన్నిక‌ల్లో విజయం ఎవ‌రిని వ‌రిస్తుందో వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: