ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఫ్యాన్ గాలి జోరుగా సాగుతోంది. ఇంకా చెప్పాలంటే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్టిందల్లా బంగారమే అవుతుంది. సార్వత్రిక ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలు, 22 పార్లమెంట్ స్థానాలతో తిరుగులేని విజయం సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని కేవలం ఒక్క స్థానానికే పరిమితం చేశారు. ఇక జిల్లా పరిషత్ పోరులో... గతంలో ఎన్నడూ లేని విధంగా... మొత్తం 13 జిల్లాలను క్లీన్ స్వీప్ చేసి... టీడీపీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేశారు. అసలు జగన్ మైండ్ గేమ్ ఈ స్థాయిలో ఉంటుందా అని రాజకీయ విశ్లేషకులే ఆశ్చర్యపోయేలా మాస్టర్ ప్లాన్స్‌తో దూసుకెళ్తున్నారు జగన్. ఇంకా చెప్పాలంటే... తాడేపల్లి ఇంటి నుంచి కాలు బయట పెట్టకుండానే... రాజకీయ చక్రాన్ని తనదైన శైలిలో తిప్పేస్తున్నారు జగన్. గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో అమలు చేసిన కొన్ని నిర్ణయాలతో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా కూడా... అవేవి తన దారికి అడ్డులేకుండా... ఏదైనా ఎదురుదెబ్బలు తగిలినా కూడా... తనదే పై చెయ్యి అన్నట్లుగా జగన్ ముందుకు సాగుతున్నారు.

వైసీపీ ఆవిర్భవించిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం మరింత రసవత్తరంగా మారిపోయింది. సరిగ్గా పదేళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతు తెలిపింది. హస్తం పార్టీకి జై కొట్టడం టీడీపీ నేతలకు అదే తొలిసారి. దీనిపై అప్పట్లో సర్వత్రా విమర్శలు కూడా వెల్లువెత్తాయి. అయితే ఇదంతా కూడా వైఎస్ జగన్ పార్టీని అడ్డుకునేందుకు మాత్రమే అని అప్పట్లో తెలుగు తమ్ముళ్లు సర్ది చెప్పుకున్నారు కూడా. నాడు మొదలైనా టీడీపీ -  వైసీపీ పోరు... ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. రెండు పార్టీ నేతల మధ్య ప్రస్తుతం ఉప్పు, నిప్పు మాదిరి తయారైంది పరిస్థితి. చివరికి టీడీపీ అధినేతపై వ్యాఖ్యలు చేసేందుకు ఎంత వరకైనా సరే వెనుకాడేది లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు వైసీపీ నేతలు. ఇంకా చెప్పాలంటే గతంలో వైసీపీ నేతలను టీడీపీ ఎలా టార్గెట్ చేసిందో...సేమ్ అలానే ఇప్పుడు టీడీపీ నేతలను వైసీపీ టార్గెట్ చేస్తోంది. దీంతో చంద్రబాబు, జగన్ మధ్య పోరు రోజు రోజుకూ మరింత తీవ్ర రూపం దాలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: