తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. కొద్ది రోజులుగా... తెలుగు సినిమా పరిశ్రమకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య తెలియని అనిశ్చితి నెలకొంది. పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన వకీల్ సాబ్ సినిమాతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, టాలీవుడ్ మధ్య కొత్త వివాదం తెర పైకి వచ్చింది. ఇప్పుడు కొత్తగా తీసుకు వచ్చిన సినిమాటోగ్రఫీ చట్ట సవరణ బిల్లు ప్రకార టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మార్పులు రాబోతున్నాయి. కొత్త బిల్లు ద్వారా సినిమా నిర్మాతలకు గట్టి షాక్ తగులనుంది. ఇప్పటి వరకు కొత్త సినిమా విడుదలైతే చాలు.. సినిమా నిర్మాతలు పండుగ చేసుకునే వాళ్లు. సాధారణంగా నాలుగు షోలకు అనుమతి తీసుకుంటారు. కానీ ప్రముఖ హీరో సినిమా అంటే చాలు... బెనిఫిట్ షో అంటూ తెల్లవారుజామునే మొదలెడతారు. అప్పటి నుంచి ఏకంగా 7 షోలు కూడా వేస్తారు. అలాగే అదనపు రేటు కూడా వసూలు చేస్తారు.  దీని వల్ల ప్రేక్షకుల జేబులకు చిల్లు పడుతుంది. ఈ విషయాలన్ని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం కొత్త నిబంధనలను తీసుకువచ్చింది.

టికెట్ల అమ్మకాలు, షోలు, ఇతర అంశాల్లోను ప్రభుత్వ జోక్యం తప్పనిసరిగా ఉండేలా కొత్త నిబంధనలను ప్రభుత్వం రూపొందించింది. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీ దాదాపుగా జగన్ సర్కార్ కంట్రోల్‌లో ఉంటుంది. పరిశ్రమ అభివృద్ధి సాయం చేయండి అంటూ జగన్ చుట్టూ ప్రదక్షిణలు చేశారు టాలీవుడ్ పెద్దలు. ఇక ఆన్ లైన్ టికెట్ల అంశంలో కూడా పలువురు నిర్మాతలు మంత్రి పేర్ని నానితో కూడా భేటీ అయ్యారు. కానీ ప్రభుత్వం మాత్రం తాను అనుకున్నది చేసేసింది. కొత్త సినిమాలు, భారీ సినిమాల ఆదాయానికి గట్టి దెబ్బ తగిలేలా కొత్త సినిమాటోగ్రఫీ చట్టం ఉంది. ప్రభుత్వమే వెబ్ సైట్ ద్వారా ఇక నుంచి సినిమా టికెట్లు విక్రయిస్తుంది. ఒక రకంగా టికెట్ల వ్యవహారం మొత్తం కూడా ఇకపై ప్రభుత్వం కంట్రోల్‌లోనే ఉంటుంది. ఒక సినిమా ఎన్ని షోలు వేశారు. ఫుల్ అయ్యిందా లేదా... ఎన్ని టికెట్లు అమ్మారు అనే విషయం వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్‌లో తెలిసిపోతుంది. అలాగే ఇకపై ఇష్టం వచ్చిన ధరకు అమ్మే అవకాశం కూడా లేదు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే టికెట్లు విక్రయించాల్సి ఉంటుంది. టికెట్లు ఎన్ని అమ్మాలి, ఎప్పుడు అమ్మాలి, ఎంత ధరకు అమ్మాలనే విషయాలు కూడా ప్రభుత్వం పరిధిలోకే వస్తాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: