ఆచార్య పోస్ట్ పోన్ అయినా, ఇతర వ్యవహారాల్లో యాక్టివ్ గా లేకపోయినా చిరంజీవి కొన్ని రోజులుగా టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. సినిమా పెద్దను కాదు అంటూ చర్చల్లోకి వచ్చారు. ఆ తర్వాత ఏపీ సీఎం జగన్ తో భేటీ అయి మరింత సంచలనం రేపారు. సినిమావాళ్లెవర్నీ తోడు తెచ్చుకోకుండా సింగిల్ గా వచ్చి సీఎం జగన్ తో భేటీ అయ్యారు చిరు. ఆ తర్వాతే ఆయన రాజ్యసభ సీటుపై పుకార్లు వచ్చాయి. ఒంటరిగా వచ్చారు కాబట్టి రాజకీయాలు మాట్లాడుకుని ఉంటారని, చిరుకి జగన్ రాజ్యసభ సీటు ఆఫర్ చేసి ఉంటారని.. ఇలా రకరకాల కథనాలు వెలువడ్డాయి. కానీ చిరంజీవి వాటన్నిటినీ తోసిపుచ్చడంతో కథ అక్కడితో అయిపోయింది.

కానీ వైసీపీ నేతలు మాత్రం ఆ కథని అక్కడితో ఆపేలా లేరు. అనుకోకుండా ఆయన్ను మళ్లీ సీన్ లోకి తెచ్చారు. ఆ తెచ్చింది ఎవరో కాదు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. అవును, చిరంజీవి రాజ్యసభ సీటు విషయంలో జరిగిన ప్రచారంపై ఆయన తాజాగా స్పందించారు. పిలిచి రాజ్యసభ సీటు ఇవ్వాల్సిన అవసరం వైసీపీకి లేదని చెప్పారాయన. అదే సమయంలో పార్టీకోసం కష్టపడి పనిచేసిన వారికి మాత్రమే ఆ అర్హత ఉంటుందని కూడా చెప్పారు. నిజమే చిరంజీవి వైసీపీకోసం కృషిచేయలేదు, ఆయనకి పార్టీకి సంబంధం లేదు, అందుకే ఆయన్ని పిలిచి సీటు ఇవ్వలేదని అనుకుందాం. మరి పరిమల్ నత్వానీ సంగతేంటి. పోనీ ఆయది జగన్ కోటా అనుకుందాం. మరిక్కడ చిరంజీవే స్వయంగా తనకి రాజకీయాలు ఇష్టంలేదు అని చెప్పారు కదా. కానీ ఆయన పేరు ప్రస్తావనకు తీసుకొచ్చి కలకలం రేపారు వైవీ సుబ్బారెడ్డి.

వాస్తవానికి వైవీ కూడా రాజ్యసభ రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. రెండేళ్ల తర్వాత టీటీడీ చైర్మన్ గా వైవీ స్థానంలో మరొకరికి అవకాశం ఇచ్చి, ఆయన్ను రాజ్యసభకు పంపిస్తారని అనుకున్నారు. కానీ అది సాధ్యం కాలేదు. వైవీ సుబ్బారెడ్డిని రెండోసారి టీటీడీ చైర్మన్ గా నియమించిన జగన్, ఆయన రాజ్యసభ అంచనాలను తాత్కాలికంగా పక్కనపెట్టారు. ఇప్పుడు మరోసారి రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్న నేపథ్యంలో ఏపీనుంచి ఎవరికి అవకాశం ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది. చిరంజీవికి సీటు ఇవ్వలేదని, ఇవ్వరని కూడా తేలిపోయింది. మరి వైసీపీలో సీటు ఆశించేవారు ఎవరు..? వారి ఆశలు నెరవేరతాయా..? అనేది తేలాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: