ఇప్పుడు యురేనియం గురించి పెద్ద దుమారం రేపుతోంది. అయితే యురేనియంతో పెట్టుకుంటే ప్రళయంతో తల గోక్కోవడం. తప్పు జరిగిన తర్వాత సరిదిద్దుకోవడమనేది ఉండదు. అయితే ఇదే అమెరికా, బ్రెజిల్‌ దేశాలు నేర్చిన గుణపాఠం. తెలుగు రాష్ట్రాలు మాత్రం నేర్చుకోలేదు. నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌ మధ్యలో కొండను తొలిచి యురేనియాన్ని తవ్వేందుకు కేంద్రం ప్రయత్నిస్తే, గనుల తవ్వకాల్లో వచ్చే భారీ రాయల్టీకి రాష్ట్రాలు తలదించుకుంటున్నాయి. నీటిని యురేనియం వేగంగా కలుషితం చేస్తుందని ఐరాస పర్యావరణ పరిరక్షణ సంస్థ హెచ్చరించింది. హానికరమైన రేడియోధార్మిక పదార్థం కలిగిన నీటిని తాగితే మనిషి మనుగడే ప్రమాదమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్‌కు నీళ్లిచ్చే నాగార్జునసాగర్‌ సమీపంలోనే యురేనియం తవ్వకాలను జరిపేందుకు రెడీ అవుతున్నారు. ఇదే జరిగితే కనుక అచ్చంగా అంటాస్‌ రిజర్వాయర్‌ తరహాలోనే సాగర్‌కు, అక్కంపల్లి రిజర్వాయర్‌కూ ప్రమాదం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా  ఉన్నాయనే చెప్పాలి.

 

అసలు ఎందుకోసం ఈ యురేనియం?

అసలు ఈ యురేనియం ఎందుకోసమని చాలా మందిలో తలెత్తుతున్న ప్రశ్న. అణు విద్యుత్ ఉత్పత్తిలో, అణ్వాయుధాల తయారీలో యురేనియం వాడతారు. ‘యురేనియం' ఓ రేడియో ధార్మిక పదార్థం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రేడియో ధార్మిక పదార్థాల్లోకెల్లా యురేనియం వాడకం ఎక్కువ. ప్రపంచంలో అతి ఎక్కువగా తవ్వితీసే రేడియోధార్మిక పదార్థం యురేనియమేనని నిపుణులు చెబుతున్నారు. బొగ్గు, నీరు, గాలి, సూర్యుడి నుంచి కరెంటు తీసినట్టే అణు పదార్థాల నుంచి కూడా కరెంటు తయారు చేస్తారు. అణు ధార్మిక పదార్థాల నుంచి మిగిలిన వాటి కంటే ఎక్కువ మొత్తంలో కరెంటు వస్తుంది. ఇందులో రిస్కు, ఖరీదు కూడా అందుకు తగినట్లుగానే ఉంటాయి.

యురేనియం ఎంత శక్తిమంతమైన ఖనిజం అంటే, ఒక కేజీ యురేనియం-235 సుమారు 1500 టన్నుల బొగ్గుతో సమానమైన కరెంటునిస్తుందని జాన్ ఎమ్స్లే రాసిన 'నేచర్స్ బిల్డింగ్ బ్లాక్స్: యాన్ ఏ టు జెడ్ గైడ్ టు ద ఎలిమెంట్స్' పుస్తకం చెబుతోంది.

 

భాగ్యనగరానికి నష్టమేనా..?

నల్లమల అడవి హైదరాబాద్‌కు దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే  అక్కడ మాత్రం తవ్వకాలు జరిపితే మనకేం నష్టం జరుగుతుందని అనుకుంటే పొరపాటు పడ్డట్లే. ఎందుకంటే హైదరాబాద్‌ లో చాలా మందికి తాగునీటి అవసరాలకు కృష్ణానీరే దిక్కు. నల్లమలలో యురేనియం తవ్వకాలు జరిగితే కృష్ణానది అచ్చంగా బ్రెజిల్‌లోని అంటాస్‌ రిజర్వాయర్‌ తరహాలో వ్యర్థాలతో కాలుష్య కాసారమే కానుంది. పీఏపల్లి మండలంలోని అక్కంపల్లి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి కృష్ణా జలాలు నగరానికి వస్తున్నాయి. నాగార్జునసాగర్‌ బ్యాక్‌ వాటర్‌ నుంచి అక్కంపల్లికి కృష్ణానీరు వెళ్తుంది. కేంద్రం సర్కార్ ప్రణాళిక ప్రకారం నల్లమల్ల పరిధిలోని పీఏపల్లి మండలం పెద్దగుట్ట-నంబాపూర్‌ పరిధిలో 10 కొండలపై యురేనియం అన్వేషణకు తవ్వకాలు జరగనున్నాయి. యురేనియం శుద్ధి చేసేందుకు పెద్ద ఎత్తున నీరు అవసరపడుతుంది. శుద్ధి ఇక్కడే జరిగితే మాత్రం కృష్ణా నది కలుషితం కానుంది. యురేనియం తవ్వకాలను చేపడితే.. హైదరాబాద్‌లో గల్లీకో డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే హైదరాబాద్‌లో మాత్రం చాలా మందికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలుంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

యూరేనియం వెలికి తీయడం అంత సులభం కాదు:

భూమిలో నిక్షిప్తమైన యురేనియాన్ని వెలికితీయడం అంత సులభం కాదు. కొన్ని వందల అడుగుల లోతు తవ్వాల్సి ఉంటుంది. అందులో వెలువడే ముడి ఖనిజాన్ని శుద్ధి చేస్తేకానీ యురేనియాన్ని వేరుచేయలేని పరిస్థితి. శుద్ధి ప్రక్రియ జరిగే క్రమంలో రేడియోధార్మిక కలిగిన వ్యర్థాలు తుంగభద్ర, కృష్ణానదుల్లో కలవడం వల్ల ఆ నీళ్లు సాగు, తాగునీటి అవసరాలకు ఏమాత్రం పనికిరావు. ఇదే జరిగితే.. అది బిరబిరా పారే కృష్ణమ్మ కంఠానికి ఉరితీతేనని నిపుణులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. యురేనియం కలిసిన నీళ్లను శుద్థి చేసే పరిజ్ఞానం మనవద్ద లేదని నిపుణులు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: