అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన మహిళల 51 కేజీల సెలెక్షన్ ట్రయల్స్ ఫైనల్ మ్యాచ్ శనివారం తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్‌- లెజెండరీ ప్లేయర్ మేరీ కోమ్ మధ్య ముగిసిన సంగతి తెలిసిందే. అయితే పోరు ముగిశాక నిఖత్‌పై తన అసహనాన్ని మేరీ వ్యక్తం చేసింది. మ్యాచ్ అనంతరం మర్యాదపూర్వకంగా ఇరువురు ప్లేయర్లు ఒకరికొకరు షేక్ హ్యాండ్ లేదా హగ్ ఇచ్చుకోవడం ఆనవాయితీ. అయితే నిఖత్‌ పై కోపంతో మేరీ షేక్ హ్యాండ్‌కు తిరస్కరించింది. 

 

ఈ ఘటనపై మ్యాచ్ ముగిశాక మేరీ మాట్లాడుతూ.. ఆ సమయంలో తాను చాలా కోపంతో ఉన్నాననడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం వివాదం ముగిసింది. ఈ మ్యాచ్ అనంతరం నేనొక్కటే చెప్పదల్చుకున్నా. మాటలతో కాదు చేతలతో మాట్లాడాలని. ఈ రోజు బాక్సింగ్ రింగ్‌లో ఏం జరిగిందో అందరూ చూశారు అని మేరీ వ్యాఖ్యానించింది.

 

అయితే ఈ వివాదాన్ని తాను ప్రారంభించలేదని, తానేప్పుడూ ట్రయల్స్‌కు హాజరవనని చెప్పలేదని మేరీ తెలిపింది. ఇందులో తన ప్రమేయమీమీ లేదని, అయినప్పటికీ తన పేరును లాగారని ఆవేదన వ్యక్తం చేసింది. మరోవైపు మ్యాచ్ అనంతరం మేరీ తీరుతో తాను చాలా హర్ట్ అయ్యానని నిఖత్ తెలిపింది. రింగ్‌ లోనూ ఆమె ప్రవర్తన సరిగ్గా లేదని పేర్కొంది. మ్యాచ్ ముగిశాక ఒక జూనియర్‌గా తనకు ఒక హగ్ ఇస్తే బాగుండేదని, అయితే దీనిపై తానేమీ కామెంట్ చేయబోనని నిఖత్ వ్యాఖ్యానించింది.

 

నిజానికి వీరిద్దరి మధ్య వివాదం ఒలింపిక్స్‌లో కొన్ని కేటగిరీలను ఎత్తివేయడంతో ప్రారంభమైంది. అంతకుముందు వరకు వేరే కేటగిరీలో ఆడుతున్న మేరీ.. మెగా టోర్నీ కోసం 51 కేజీల విభాగానికి మారింది. సీనియారిటీని బట్టి ఒలింపిక్స్ క్వాలిఫయర్స్‌కు మేరీని పంపుతామని బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించడంతో వివాదం తారాస్థాయికి చేరింది. దీంతో తన అవకాశాలు దెబ్బతింటున్నాయని నిఖత్ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. అనంతరం ఇరువురి మధ్య ట్రయల్స్ నిర్వహించారు. ఈ పోరులో మేరీ 9-1తో నిఖత్‌ను చిత్తుగా ఓడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: