ఇంటర్నెట్ డెస్క్: పాకిసాన్ పేసర్ మొహమ్మద్ ఆమిర్ తన రిటైర్మెంట్ గురించి మళ్లీ షాకింగ్ కామెంట్స్ చేశాడు. దాదాపు నెల రోజుల క్రితం ఊహించని విధంగా అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలుతున్నట్లు 28 ఏళ్ల ఆమిర్ ప్రకటించాడు. జట్టు మేనేజ్‌మెంట్, పీసీబీ ఒత్తిడి తట్టుకోలేకనే తాను క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. దీంతో పీసీబీ, మిస్బా ఉల్ హక్ లపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. 


అయితే కొందరు పీసీబీ సభ్యులు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, టెస్టు క్రికెట్ ఆడడం ఇష్టం లేకే తాను రిటైర్మెంట్ ప్రకటించినట్లు అబద్ధాలు చెబుతున్నారని అన్నాడు. తనను న్యూజిలాండ్ సిరీస్ నుంచి పక్కన పెట్టడం వల్లే రిటైర్మెంట్ ప్రకటించానంటూ ప్రచారంలో ఉన్న వార్తల్లోనూ నిజం లేదని ఆమిర్ స్పష్టం చేశాడు. 


ఈ మేరకు ఆమిర్ తాజాగా ఓ ట్వీట్ కూడా చేశాడు. తన మనసులోని విషయాన్ని బయటపెట్టాడు. మిస్బాబుల్ హక్ సారథ్యంలోని ప్రస్తుత మేనేజ్‌మెంట్ తప్పుకునే వరకు తాను మళ్లీ జట్టులో చేరడపై ఆలోచన కూడా చేయనని అన్నాడు. వాళ్ళు వెళ్లిపోయినప్పుడే తాను పాకిస్థాన్‌కు ఆడడం గురించి ఆలోచిస్తానని చెప్పాడు. ‘‘ఈ విషయంలో నేను స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అవును, పాకిస్థాన్ కోసం ఆడేందుకు నేను సిద్ధమే. కాకపోతే ప్రస్తుత మేనేజ్‌మెంట్ తప్పుకుంటేనే దాని గురించి ఆలోచిస్తా. కాబట్టి మీ కథనాలను అమ్ముకోవడం కోసం తప్పుడు వార్తలు ఆపండి’’ అని తన ట్వీట్ లో పేర్కొన్నాడు. 


అంతేకాకుండా టీ20 లీగుల్లో ఆడడం కోసం దేశం తరపున వన్డేలు, టీ20ల్లో ఆడేందుకు తానెప్పుడూ నిరాకరించలేదని, కానీ పీసీబీ మేనేజ్‌మెంట్ సభ్యులు మాత్రం టీ20 లీగుల కోసమే తాను టెస్టులను పట్టించుకోలేదని ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఫలితంగా తన ప్రతిష్ఠ దెబ్బతిన్నదని, తన గురించి ప్రజల్లో అసత్యాలు ప్రచారమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. వాసిమ్ ఖాన్‌తో కానీ, ఎహసాన్ మణితో కానీ తనకు ఎటువంటి సమస్య లేదని, తన సమస్య మొత్తం ప్రస్తుత మేనేజ్‌మెంట్‌తోనే అని ఆమిర్ స్పష్టం చేశాడు.  


ఇదిలా ఉంటే ఆమీర్ వ్యాఖ్యలపై పాక్ క్రికెట్ కోచ్, చీఫ్ సెలెక్టర్  మిస్బావుల్ హక్ స్పందించాడు.  ఆమిర్ అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించడంపై ఎన్నో వార్తలొస్తున్నాయని, వాటిని అతడు ఆపాలనుకుంటే తొలుత దేశవాళీ క్రికెట్‌లో ఆడి నిరూపించుకోవాలని సవాల్ చేశాడు. మరి ఈ సవాల్ ను ఆమిర్ స్వీకరిస్తాడో లేదో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: