పబ్‌జీ గేమ్ కి బానిసగా మారిన కొడుకుని తండ్రి మందలించాడు. తండ్రి మందలించడంతో ఆ కొడుకు ప్రాణాలు తీసుకోబోయాడు. ఏకంగా ఐదంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ షాకింగ్ ఘటన పంజాగుట్ట ప్రతాప్‌నగర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ప్రతాప్ నగర్ లో ఓ కుటుంబం కొన్నేళ్లుగా నివాసముంటోంది. ఆన్‌లైన్‌ క్లాసులున్న నేపథ్యంలో ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్న బాలుడు (17) కొన్ని రోజులుగా పబ్‌జీ ఆటకు బానిసయ్యాడు. అది గమనించిన ఆ బాలుడి తండ్రి శనివారం రాత్రి అతడిని మందలించాడు. దీంతో మనస్థాపానికి గురైన బాలుడు పక్కనే ఉన్న ఐదంతస్తుల ఇంటిపైకి ఎక్కి కిందికి దూకేశాడు.


ఈ క్రమంలో నేరుగా కరెంటు వైర్లు, కేబుల్‌ వైర్లపై పడి కిందకు జారాడు. అదృష్టవశాత్తు బాలుడికి స్వల్ప గాయాలే కావడంతో ప్రాణాపాయం తప్పింది. ఇటు వైర్లపై ఒకేసారి భారం పడటంతో కరెంటు స్తంభం కూడా కూలింది. బాలుడిని సమీపంలోని తన్వీర్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇటు కరెంటు స్తంభం కూలడంతో శనివారం రాత్రి 8.30 గంటల నుంచి ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది కొత్త స్తంభాన్ని ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.


ఇదిలా ఉండ‌గా పాపులర్ మొబైల్ గేమ్ మళ్లీ ఇండియాలోకి రీఎంట్రీ ఇస్తోంది. భారతదేశంలో లక్షలాది మంది పబ్‌జీ లవర్స్.. యాప్ లాంచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ప‌బ్‌జీ మొబైల్ ఇండియా రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పబ్ జీ మొబైల్ ఇండియా యాప్ లాంచ్ కు సంబంధించి ఒక టీజర్ వీడియో కూడా రిలీజ్ చేసింది కంపెనీ. డియాలో టెన్సెంట్ కంపెనీ యాప్ పబ్ జీ బ్యాన్ చేసిన తర్వాత పబ్ జీ మొబైల్ ఇండియా కొత్తగా రీఎంట్రీ ఇస్తోంది. సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకునేలా ఉంటాయని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: