కొడాలి నాని..పరిచయం అవసరం లేని, వైసీపీ సీనియర్ నేత, మంత్రి. పౌరసరఫరాల శాఖ మంత్రిగా నాని ముద్ర ఏమిటో తెలీదు కానీ బూతులమంత్రిగా మాత్రం బాగా పేరుతెచ్చుకున్నారు. కొడాలికి టీడీపీ నేతలు బూతులమంత్రిగా పేరు పెట్టారు. బూతులు మాట్లాడేందుకు జగన్మోహన్ రెడ్డి ఓ శాఖను ఏర్పాటు చేసి దానికి కొడాలిని మంత్రిని చేయాలని కూడా దెప్పి పొడుస్తున్నారు. చంద్రబాబునాయుడు అన్నా దేవినేని ఉమా అన్నా కొడాలి ఒంటికాలిపై లేస్తారు. వాళ్ళపై ఆరోపణలు చేసేటపుడు, విమర్శలు చేసేటపుడు పూనకం వచ్చినట్లు కొడాలి ఊగిపోతారనే విషయం ఇఫ్పటికే కొన్నివందలసార్లు జనాలు చూసిందే. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే టీడీపీ నేతలు కూడా కావాలనే కొడాలిని రెచ్చగొట్టడానికే మంత్రిని టార్గెట్ చేస్తున్నారు. అంటే తాము కొడాలిపై ఆరోపణలు, విమర్శలు చేయటం ద్వారా వాళ్ళే కొడాలిని రెచ్చగొడుతున్నారు. దాంతో ఒళ్ళుమరచిపోతున్న కొడాలి వాళ్ళని బూతులు తిట్టేస్తున్నారు.




నిజానికి ఇక్కడ తప్పు రెండువైపులా జరుగుతోంది. ఎవరు ఎవరినీ రెచ్చగొట్టేట్లుగా మాట్లాడకూడదు. ఒకళ్ళు రెండోవాళ్ళని రెచ్చగొట్టినా సంయమనం పాటించటం అన్నది అంతిమంగా సమాజానికి మంచిది. మరి తెలిసో తెలియకో కొడాలి టీడీపీ నేతలు ఉచ్చులో పడిపోతున్నారు ప్రతిసారి. నిజానికి టీడీపీ వాళ్ళని తిట్టకుండా కూడా కొడాలి మంచి పాయింట్లతో, పంచ్ డైలాగులు విసరగలరని గతంలోనే చాలాసార్లు రుజువైంది. కానీ మంత్రయిన తర్వాతే ఎందుకో మరి కొడాలి రూటు మార్చుకున్నారు. మంత్రి గమనించాల్సిన విషయం ఏమటంటే 24 గంటలూ ఎదుటివారిని నోటికొచ్చినట్లు తిట్టేవాళ్ళని మామూలు జనాలు హర్షించరు.




ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మంత్రిని ఇంటర్వ్యూ చేసే టీవీ ఛానళ్ళు కూడా కొడాలిని ఎలా రెచ్చగొడితే చంద్రబాబును, దేవినేనిని తిడతారో అలాగే రెచ్చగొడగుతున్నాయి. ఏదేమైనా ప్రత్యర్ధులపై నోటొకిచ్చినట్లు తిట్టడాన్ని పక్కనపెట్టేసి శాఖాపరమైన అంశాలపై మంత్రి దృష్టిపెడితే బాగుంటుంది. ఇంటింటికి రేషన్ లాంటి అనేక మంచి కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. జనాలకు ఉపయోగపడే ఇటువంటి కార్యక్రమాల్లో లోటుపాట్లుండటం కూడా సహజమే. కాబట్టి జనాలకు ఉపయోగపడే పథకాల అమలోని లోపాలను గుర్తించి వాటిని పరిష్కరిస్తే ఎక్కువమంది జనాలకు ప్రభుత్వం ద్వారా లబ్ది జరుగుతుందని కొడాలి గుర్తించాలి. కాబట్టి శాఖాపరమైన పట్టుసాధించటం అంటే జనాలకు మంచి జరగటమే అనటంలో సందేహం లేదు. చంద్రబాబు, దేవినేని మీద నోరుపారేసుకుంటే ఏమొస్తోంది నోరు నొప్పితప్ప. కాబట్టి వాళ్ళని వదిలిపెట్టేసి తన దృష్టిని పూర్తిగా శాఖపైన కేంద్రీకరిస్తే మామూలు జనాలకు ఉపయోగమని కొడాలి గ్రహించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: