
మన దేశంలో ఏదైనా కేసులో తీర్పు రావాలంటే చాలా ఏళ్లు పడుతుందని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత న్యాయమూర్తులు మనకి అనుకూలంగా తీర్పు ఇవ్వకపోతే వారిని కేంద్రంగా చేసి పోస్టులు పెడుతుండటం మనం గమనిస్తూనే ఉన్నాం. దీనివల్ల వారి ప్రతిష్ఠ దెబ్బతినడమే కాకుండా న్యాయం కంటే ఎక్కువగా వారికి అన్యాయమే నడుస్తోంది.
న్యాయమూర్తుల కష్టం ఏ విధంగా ఉంటుందంటే ఉదాహరణకు చంద్రబాబు కేసు ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు జడ్జి తన విధులు నిర్వర్తిస్తూనే ఉండాలి. ఇద్దరి వాదనలు వినాలి. వీరి తరఫున లాయర్లు ఉటంకించిన కేసులను పరిశీలించాలి. ఆ తర్వాత తీర్పు ఇవ్వడం వీరికి తలకు మించిన భారమే అవుతుంది. విధులు ముగించుకొని ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా గడపలేని పరిస్థితి. ఇంటి దగ్గర కూడా వీరు హోం వర్క్ చేయాలి. పొద్దున జరిగిన వాదనలనంతా క్రోడీకరించుకొని, వివరాలు తెప్పించుకొని ఆధారాలు పరిశీలించాలి. తీర్పును డిక్లేర్ చేయాలి. అవన్నీ టైప్ చేయాలి. వీళ్ల తీర్పును అందులో పొందుపరచాలి. ఉటంకించిన కేసు వివరాలను పునః పరిశీలించాలి. పెద్ద కేసు అయితే రెండు నుంచి నాలుగైదు రోజులు పట్టే పరిస్థితి.
ఇక్కడ తీర్పు అనుకూలంగా రాని వారు సుప్రీం కోర్టుకు వెళతారు. తీర్పులో ఏమైనా తేడా జరిగిందంటే సుప్రీం కోర్టుతో చివాట్లు తింటారు. మేజిస్ట్రేట్ లకు హైకోర్టు అంటే భయం. హైకోర్టులకు సుప్రీంకోర్టు అంటే భయం. దీంతో విపరీతమైన పని పెట్టుకొని రిస్క్ తీసుకుంటూ ఉంటారు.
దీంతో వారు బీపీ, షుగర్ వంటి అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడికి గురి కావాల్సిన పరిస్థితి. ఇంత చేసినా నిజాయతీ పరులు 10 శాతం కూడా ఉండరు. ఇది జడ్జిలను మరింత అసహనానికి గురి చేస్తూ ఉంటుంది. నిజంగా న్యాయమూర్తుల కష్టం పగవాడికి కూడా రాకూడదు అనడంలో అతిశయోక్తి లేదు.