సంవత్సర కాలంగా ప్రపంచ దేశాల ప్రజలను ఎన్నో రకాల అవస్థలకు గురి చేసిన భయంకరమైన కరోనా వైరస్ మహమ్మారి నిర్మూలనకు పలు ఫార్మా దిగ్గజ కంపెనీలు వ్యాక్సిన్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మనదేశంలో కూడా మరో రెండు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ డ్రైన్ రన్ నిర్వహించారు అలాగే అన్ని రాష్ట్రాల ప్రధాన ప్రాంతాలకు వ్యాక్సిన్ పంపిణీ కూడా చేయడం జరిగింది. ఇక ఈ సందర్భంగా కరోనా టీకా విషయమై తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి విజయ భాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా టీకా వేసుకొని మద్యం సేవించరాదని విజయభాస్కర్‌ సూచించారు. దానివల్ల అనవసరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని అన్నారు. చెన్నైకు చేరుకున్న కరోనా టీకాను రాష్ట్రవ్యాప్తంగా 10 మండలాలకు మంగళవారం తరలించారు అధికారులు. తిరుచ్చికి చేరుకున్న టీకాను ఖాజామలై ప్రాంతంలో ఉన్న ఆరోగ్యశాఖ సహాయ డైరెక్టర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రంలో భద్రపరిచారు.



ఈ కేంద్రాన్ని బుధవారం ఉదయం ఆరోగ్యశాఖ మంత్రి డా.సి.విజయభాస్కర్‌ పరిశీలించారు. ఆయనతో పాటు పర్యాటక శాఖ మంత్రి వెల్లమండి ఎన్‌.నటరాజన్‌, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్‌.వలర్మతి, కలెక్టర్‌ శివరాజు తదితరులున్నారు. తిరుచ్చి నుంచి ఇతర జిల్లాలకు టీకాలను తరలిస్తున్న ప్రత్యేక వాహనాలను మంత్రి విజయభాస్కర్‌ జెండా పూపి ప్రారంభించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 16వ తేదీ టీకాలు వేసే కార్యక్రమం ప్రారంభించనున్నామని తెలిపారు. కరోనా టీకా రాష్ట్రంలోని పది మండలాలకు తరలించి, అక్కడి నుంచి జిల్లాలకు ప్రత్యేక వాహనాల ద్వారా తరలిస్తున్నామన్నారు. టీకా వ్యవహారమై సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలను ప్రజలు నమ్మరాదని, నిరాధారమైన వదంతులు సృష్టిస్తున్న వారిపై కఠినచర్యలు చేపడతామని మంత్రి హెచ్చరించారు. ఇటు రెండు తెలుగు రాష్ట్రాలయిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలకు కూడా కరోనా వ్యాక్సిన్ చేరుకున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: