రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు వుండరన్న మాట మరోసారి రుజువు కాబోతోంది. ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ విషయం తెలిసిపోతోంది. అసెంబ్లీలో చంద్రబాబుపై వైసీపీ నేతలు దారుణమైన వ్యాఖ్యలు చేశారంటూ విమర్శలు వినిపించడంతో ఆయనపై ఇప్పుడు, పార్టీలకతీతంగా సింపతీ పెరిగిపోతోంది. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, చంద్రబాబుపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఇప్పుడు తాజాగా బీజేపీ నేతలు కూడా చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా బాబుకు మద్దతుగా మాట్లాడి, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరనే మాటను నిజం చేశారు.

చంద్రబాబుకు మద్దతుగా.. తన సోదరి భువనేశ్వరికి మద్దతుగా పురంధీశ్వరి మాట్లాడారంటే ఓ అర్థముంది. అయితే ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా ఇప్పుడు బాబుకి మద్దతుగా మాట్లాడారు. వైసీపీ నేతలంతా బాబుది నటన అంటుంటే.. బీజేపీ మాత్రం వైసీపీపై మండిపడింది.. ఏపీలో ప్రతిపక్ష పార్టీల నేతలపై అధికార పార్టీ నేతలు పోటీలు పడి మరీ విమర్శలు చేస్తున్నారని.. అసెంబ్లీలో ప్రజల సమస్యలు చర్చించడం మానేసి.. తమ నాయకుడికి భజన చేసుకుంటున్నారని సోము వీర్రాజు మండిపడ్డారు. శాసనసభ గౌరవాన్ని దిగజారుస్తున్నారంటూ ధ్వజమెత్తారు. అధికార, ప్రతిపక్షాలు ప్రజల కోసం పని చేసినప్పుడే సభ గౌరవం పెరుగుతుందని చెప్పారు.


 

ప్రజలు పాలకులను ఈసడించుకోకముందే వైసీపీ ప్రభుత్వం కళ్ళు తెరవాలంటూ ట్విట్టర్ వేదికగా సోము వీర్రాజు ఘాటుగానే స్పందించారు. ఇటీవల కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కూడా టీడీపీతో కలిసి పనిచేయాల్సి రావచ్చని తిరుపతి పర్యటనలో హింట్ ఇచ్చారు. అమరావతి రైతులకు మద్దతుగా ఉండాలని బీజేపీ నేతలకు సూచించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ నేతలు ఇలా టర్న్ తీసుకున్నట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో బీజేపీతో కలిసి టీడీపీ నడవబోతున్నట్టు అర్ధమవుతోంది. ఇప్పటికే బీజేపీతో జనసేన మిత్రపక్షంగా ఉండటంతో ఇప్పుడు తాజాగా ఆ జాబితాలోకి టీడీపీ కూడా వచ్చి చేరినట్టు తెలుస్తోంది. ఎన్నికల నాటికి ఎవరు ఎవరితో పొత్తులో ఉంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: