
అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత యూనివర్సిటీ ప్రాధాన్యతను గుర్తించామన్నారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం పేర్నమిట్ట గ్రామంలో యూనివర్సిటీ ఏర్పాటు ప్రతిపాదించడం జరిగింది. ఇప్పటికే స్థల సేకరణ కూడా పూర్తైందన్నారు. అవసరమైన పోస్టుల భర్తీకి కూడా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అన్ని యూనివర్సిటీలకు భిన్నంగా ఇక్కడ ఉపాధ్యాయ విద్య ఏర్పాటు చేయటం జరుగుతుందన్నారు. ప్రస్తుతం అస్తవ్యస్తంగా ఉన్న ఉపాధ్యాయ విద్యను ఉన్నత విద్యాసంస్థలోకి చేర్చటంపై అవసరాన్ని ఈ ప్రభుత్వం గుర్తించింది. ఇందులో భాగంగా ఒక శిక్షణా కేంద్రాన్ని స్థాపించి అధ్యాపక విద్య నాణ్యతను పటిష్టపరచడం ద్వారా నాణ్యమైన అధ్యాపకులను తయారు చేయాలి అనేది తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి చెప్పారు. బిల్లు ఆమోదం ద్వారా యూనివర్సిటీ ఏర్పాటులో తదుపరి చర్యలు వేగవంతంగా జరిగే అవకాశాలు ఏర్పడ్డాయి. ప్రకాశం జిల్లాలో ఆంధ్ర కేసరి యూనివర్సిటీ ఏర్పాటుపై పలువురు మండలి సభ్యులు, శాసనసభ్యులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ను అభినందించి మద్దతు తెలిపారు.