నమ్మినవారి కోసం వైఎస్ కుటుంబం ఏమైనా చేస్తుందని ఓ నమ్మకం ఉంది. వైఎస్ జగన్ కూడా అంతే.. అందుకే తాను నమ్మినవారికి అందలం ఎక్కించేందుకు ఎన్ని విమర్శలైనా పెద్దగా లెక్కచేయరు. అందుకే తెలంగాణ కేడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి స్టీఫెన్‌ రవీంద్ర, ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మిలను ఏపీకి తెచ్చుకోవాలనుకున్నారు. దాని కోసం చాలా ప్రయత్నాలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డితో వీరికి గల అనుబంధమే అందుకు కారణం.


కానీ జగన్ ఎంతగా కోరుకున్నా.. ఆయన కోరిక నెరవేరే అవకాశాలు కనిపించడం లేదు. స్టీఫెన్ రవీంద్రను డిప్యుటేషన్‌పై ఏపీకి పంపేందుకు కేంద్రం ఒప్పుకోవడం లేదు. ఇదే పరిస్థితి తెలంగాణకే చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మి డిప్యుటేషన్‌ విషయంలోనూ ఎదురయ్యే ఛాన్సులు ఉన్నాయి. కేంద్రానికి పెద్దగా అభ్యంతరాలు లేకపోయినా సాంకేతిక సమస్యల కారణంగానే వీరిద్దరి బదిలీ జరిగే అవకాశాలు లేవని తెలుస్తోంది.


ఎందుకంటే.. వీరిద్దరూ సీనియారిటీ పరంగా ‘సూపర్‌ టైమ్‌’ స్కేల్‌లో ఉండటమే దీనికి కారణమట. సూపర్‌ టైమ్‌ స్కేల్‌ అధికారులను ఇతర రాష్ట్రాలకు డిప్యుటేషన్‌పై పంపడం కుదరదని గతంలో కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఈ రూల్ బ్రేక్ చేయాలంటే అది చాలా అసాధారణ పరిస్థితి అయి ఉండాలి. శ్రీలక్ష్మి, స్టీఫెన్‌ రవీంద్రల విషయంలో అలాంటి అసాధారణ పరిస్థితులు ఏమీ లేవని కేంద్రం ఫీలవుతోందట. స్టీఫెన్‌ రవీంద్ర విషయంలో ఇప్పటికే కేంద్రం క్లారిటీ ఇచ్చేసింది కూడా.. ఇక శ్రీలక్ష్మి డిప్యుటేషన్‌ ఫైలు విషయంలోనూ అదే జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.


జగన్ అధికారంలోకి రాగానే... ఇంటలిజెన్స్ చీఫ్ గా స్టీఫెన్‌ రవీంద్ర పేరు బాగా వినిపించింది. ఆయనను తమ రాష్ట్రానికి పంపించాలని జగన్‌ కోరడం... తెలంగాణ సీఎం కేసీఆర్‌ అందుకు అంగీకరించడం చకచకా జరిగిపోయాయి. ఇరు రాష్ట్రాలు పరస్పర అంగీకారంతో దీనిపై యూపీఎస్సీకి లేఖ కూడా రాశాయి. కొంతకాలం స్టీఫెన్‌ రవీంద్ర తెలంగాణలో సెలవు పెట్టి, ఏపీలో అనధికారికంగా విధులు నిర్వహించారు కూడా.. కానీ మొత్తం మీద జగన్ కు వీరిద్దరి విషయంలో ఆశాభంగం తప్పకపోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: