కరోనా కష్టకాలంలో ప్రభుత్వాలు తమ చేతనైనంత వరకూ పోరాటం చేస్తున్నాయి. పేదలను ఆదుకునేందుకు, వైద్య చికిత్సల ఏర్పాట్ల కోసం.. ఇతరత్రా అనేక అంశాల్లో తమ శక్తి మేరకు పోరు సలుపుతున్నాయి. ఈ కరోనాపై పోరాటం యజ్ఞంలో అనేక మంది పెద్ద మనసున్న దాతలు కూడా ముందుకు వస్తున్నారు. అలాంటి వారికి చేతులెత్తి మొక్కాల్సిందే.

 

 

రెండు తెలుగు రాష్ట్రాల నుంచి విరాళాలు ముఖ్యమంత్రులకు చేరుతున్నాయి. తాజాగా ఏపీ సీఎం సహాయనిధికి విరాళాలు వచ్చాయి. ఆ వివరాలు ఓ సారి చూద్దాం.. ఏపీ స్టేట్‌ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌బీసీఎల్‌) రూ.10 కోట్లు అందించింది. 2.33 లక్షల స్వయం సహాయ సంఘాలు రూ.కోటి విరాళం ఇచ్చాయి. తూర్పుగోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్, ప్రాధమిక సహకార సంఘాలు, ఉద్యోగుల ఒక రోజు వేతం రూ.60 లక్షలు అందించారు.

 

 

పశ్చిమగోదావరి జిల్లా కో–ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ సొసైటీలు, ఉద్యోగులు ఒక రోజు వేతనం రూ.45 లక్షలు సీఎం సహాయనిధికి ఇచ్చారు. గుంటూరుకు చెందిన వ్యాపారవేత్తలు పాములపాటి చంద్రయ్య రూ.5 లక్షలు, బి.జగన్‌మోహన్‌రెడ్డి రూ.లక్ష, బి.ప్రసాద్‌రెడ్డి రూ.లక్ష అందించారు. ఏపీ బార్‌ కౌన్సిల్‌ తరఫున రూ.3.25 లక్షలు ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శ్రీంపు హేచరీస్‌ అసోసియేషన్‌ తరఫున సంఘం కాకినాడ అధ్యక్షుడు వీర్రెడ్డి, కార్యదర్శి హరినారాయణ రూ.30 లక్షలు అందించారు.

 

 

గుంటూరు జిల్లాకు చెందిన బాపట్ల ఎడ్యుకేషన్‌ సొసైటీ రూ.10 లక్షలు అందించింది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కురగల్లు గ్రామంలో నిర్మాణంలో ఉన్న మాతా అమృతానందమయి విశ్వ విద్యాపీఠం, అమృత డీమ్డ్‌ యూనివర్సిటీ రూ.5 లక్షలు ఇచ్చారు. ఇవి కాకుండా హెటేరో ఫౌండేషన్‌ ప్లూవిర్‌ –75 ఎంజీ 50 వేల ట్యాబ్లెట్లు, రిటోకామ్‌ 50 వేలకుపైగా ట్యాబ్లెట్లు, హెచ్‌సీక్యూ రకం 97 వేల ట్యాబ్లెట్లతోపాటు లక్ష మాస్క్‌లు ప్రభుత్వానికి అందజేసింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: