తెలుగుదేశం పార్టీ నేత‌, మాజీ మంత్రి అచ్చెన్నాయ‌డు అరెస్టుపై రాజ‌కీయ విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌లు ఏపీలో అధికార వైసీపీ-ప్ర‌తిప‌క్ష టీడీపీల మ‌ధ్య కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా తాడేపల్లిలోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో పార్టీ సీనియ‌ర్ నేత‌, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. టీడీపీలో అచ్చెన్నాయుడు బాహుబలి అయితే.. మరి చంద్రబాబు ఎవరు? లోకేశ్‌ ఎవరు? అని ఆయ‌న సూటిగా ప్ర‌శ్నించారు. అచ్చెన్నాయుడిని సమర్థిస్తూ లోకేశ్‌ భుజాలు తడుముకున్నారెందుకు? అని మంత్రి నిల‌దీశారు. త్వరలో లోకేశ్‌ను కూడా చంద్రబాబు పరామర్శించే రోజులు వస్తాయని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

 

లోకేష్ శ్రీ‌కాకుళం టూర్ అచ్చెన్నాయుడి కుటుంబాన్ని పరామర్శించటానికి వెళ్ళినట్టు లేదని, త‌న‌కు ఏ గతి పట్టబోతుందో అన్న భయంతో  వెళ్లినట్లుందని  మంత్రి ఎద్దేవా చేశారు. ``మంత్రి సంతకం విలువ లోకేశ్‌కు తెలియదా? మంత్రి ఆదేశిస్తే కింద అధికారులు ఆపని చేయరా? లోకేశ్‌ సంతకాలు చేసిన లేఖలు అన్నీ కూడా పరిశీలిస్తాం. లోకేశ్‌ చేసిన అవినీతి మీద కూడా విచారణ జరుగుతోంది.`` అని కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. అచ్చెన్నాయుడుకు ప్రభుత్వం వల్ల ఎలాంటి ప్రాణహాని లేదని, హత్యారాజకీయాల పేటెంట్ చంద్రబాబుదని మండిప‌డ్డారు. ``ఎన్నికల్లో ఓడించడం ద్వారా వడ్డీ మాత్రమే ప్రజలు కట్టించారు. అసలు త్వరలోనే చెల్లించుకోవాలి. ``అని పేర్కొన్నారు.

 

 

గజదొంగల దగ్గరకు వెళ్లి లోకేశ్‌ ప్రవర్తిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని మంత్రి వెల్లంప‌ల్లి పేర్కొన్నారు. `సీఎం  జగన్ నాయకత్వంలో సంక్షేమ పథకాలు ఒకవైపు, అభివృద్ది మరోవైపు పరిగెడుతోంది. నారా లోకేశ్‌ చౌదరి ప్రజల గురించి ఏనాడు ఆలోచన చేయలేదు. ``అని మండిప‌డ్డారు. శ్రీకాకుళం జిల్లాలో మీడియాతో నారా లోకేశ్ చౌదరి ప్రభుత్వంపైన విమర్శలు చేయటాన్ని వెల్లంపల్లి ఖండించారు. అన్ని వర్గాలు మెచ్చుకునేలా ప్రభుత్వ పనితీరును ఉందని ఈ సమయంలో రాజకీయ విమర్శలు చేయటం ఏంటని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. కరోనా సమయంలోనూ విశాఖపట్నంలో ఒక దురదృష్ట సంఘటన జరిగితే సీఎం వైయస్‌ జగన్ మోహన్ రెడ్డి ఎంతో ఆలోచనతో దాన్ని తప్పించటానికి కృషి చేశారన్నారు. ఆ విపత్తు సమయంలో ప్రజలకు అండగా సీఎం జగన్ నిలిచారని వెల్లంపల్లి గుర్తు చేశారు. అప్పుడు ఒక్కసారైనా నారా చంద్రబాబు, నారా లోకేశ్ చౌదరి ప్రజల్ని కలిసి వారికి ధైర్యం, భరోసా ఇవ్వలేదని వెల్లంపల్లి మండిపడ్డారు. ఈరోజు ఇద్దరు గజదొంగలు ప్రభుత్వానికి దొరికితే లోకేశ్ పరామర్శలు చేయటం ఏంటని వెల్లంపల్లి ప్రశ్నించారు.

 

జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ట్యాక్స్‌లు ఎగగొట్టటం, ఒక్క పర్మిట్‌తో 100 బస్సులు తిప్పటం, లారీలను బస్సులుగా మార్చి ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారని వెల్లంపల్లి మండిపడ్డారు. అడ్డదారిలో ట్యాక్స్‌లు కట్టకుండా బస్సులు తిప్పుతుంటే..  ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. అయితే, ప్రజలకు ఏదో అన్యాయం జరిగిందన్నట్లు హడావుడిగా నారా లోకేశ్ అక్కడ వెళ్తే ఏం జరిగిందో చూశామన్నారు. ఆయన సైజుకు తగ్గట్లు చక్కటి విందు భోజనం చేసి వచ్చారని వెల్లంపల్లి ఎద్దేవా చేశారు. అలాగే ఈరోజు ఒక గజదొంగ పేద ప్రజల కష్టార్జితాన్ని దోచుకున్న ఒక దొంగ కుటుంబాన్ని పరామర్శకు లోకేశ్‌ వెళ్లారని వెల్లంపల్లి అన్నారు. వెళ్లిన వ్యక్తి ఆ కుటుంబానికి ధైర్యం చెబితే ఎవ్వరికీ ఏ ఇబ్బంది లేదన్నారు. ధైర్యం చెప్పారనుకుంటే మీడియా సమావేశంలో నానా కారుకూతలు, ఇష్టమొచ్చినట్లు నారా లోకేశ్ మాట్లాడారని వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గందరగోళం జరుగుతోందని మీడియా సమావేశంలో అన్నారని వెల్లంపల్లి మండిపడ్డారు. అసలు లోకేశ్ అక్కడకు ఎందుకు పరిగెత్తుకు వెళ్లారంటే ఎక్కడైనా అచ్చెన్నాయుడు కానీ, వారి కుటుంబసభ్యులు తన(లోకేశ్‌) పేరు ఎక్కడ చెబుతారో అన్న భయంతో పరిగెత్తుకొని వెళ్లి బ్రతిమిలాడుకున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: