ఏదైనా ప్రాజెక్టు నిర్మించేటప్పుడు  భూములు సేకరించాల్సి వస్తుంది.. తప్పుదు.. లక్షల మందికి మేలు జరిగేటప్పుడు వందల సంఖ్యలో జనం ఇబ్బంది పడక తప్పదు. అయితే అలా ఇబ్బంది పడే వారికి అన్ని సౌకర్యాలు అమర్చాలు.. వారు ఇతరుల కోసం త్యాగం చేస్తున్నందువల్ల వాళ్లకు ప్రత్యామ్నాయాలు చూపాలి. అలా చూపకుండా.. వారికి పరిహారం అందించకుండా.. అధికారులు చేతిలో అధికారం ఉందని ఇష్టారాజ్యం చేయకూడదు.

కానీ అలా జరుగుతోందంటూ  తెదేపా నాయకుడు నారా లోకేశ్ ఓ వీడియో ట్విట్టర్‌లో పోస్టు చేశారు. “ అధికార మదం కళ్ళకెక్కిన వైసీపీ పాలకులకు ప్రజల ప్రాణాలంటే లెక్కలేకుండా పోయింది. అనంతపురం జిల్లా, తాడిమర్రి మండలంలోని చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ముంపు గ్రామమైన మర్రిమేకులపల్లిలో ఓ ఇంట్లో కుటుంబ సభ్యులు ఉండగానే జేసీబీతో ఇల్లు పడగొట్టిన రాక్షసత్వం ఇది.

ఘటనలో గాయపడ్డ మూడేళ్ళ చిన్నారి చావుబతుకుల్లో ఉన్నాడు. పరిహారం చెల్లించకుండానే ఇళ్లను కూల్చివేయడం దారుణమైతే...మనుషులు ఉండగానే ఇళ్ళను కూల్చడాన్ని ఏమనాలి? బతికుండగానే మనుషుల్ని సమాధి చేయాలన్న క్రూరమైన ఆలోచనలు మీకెలా వస్తున్నాయి? ఏ మాత్రం మానవత్వం ఉన్నా కూల్చివేతలని తక్షణం ఆపండి" అంటూ  నారా లోకేశ్ ఆ పోస్టులో తెలిపారు.

ఓ ప్రతిపక్షం సహజంగా ఇలాంటి వీడియోలు పెడుతుంది. అయితే ఈ వీడియోలు చూస్తే ఎవరైనా అయ్యో అనకుండా ఉండలేరు. ఇంట్లో జనం ఉండగానే.. ఇంట్లో సామాను ఉండగానే.. ఓ జేసీబీతో కూల్చేయడం.. దానికారణంగా చిన్నారి గాయపడటం చూస్తే ఎవరికైనా కడుపు తరుక్కుపోతుంది. ఇలాంటి వీడియోల కారణంగా .. అధికారుల నిర్లక్ష్యం కారణంగా అధికారంలో ఉన్నవారికి ఇబ్బంది తప్పదు. ప్రభుత్వం ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాల్సిందే. బహుశా.. ఈ వీడియోలు జగన్ చూసినా.. సరే.. సదరు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తారనడంలో సందేహం లేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: