కరోనా కారణంగా అందరి ఆదాయాలు పడిపోయాయి. విద్యారంగం తీవ్రంగా ప్రభావితం అయ్యింది. అసలు ఇప్పటి వరకూ పాఠశాలలే తెరవలేని పరిస్థితి. సాధారణంగా ఇప్పటి వరకూ పాఠశాలల్లో దాదాపు మూడొంతుల సిలబస్ పూర్తి కావాల్సింది.. కానీ.. ఇప్పటికీ స్కూళ్లు తెరుచుకోలేదు. ఏపీలో డిసెంబర్ నుంచి స్కూళ్లు తెరిచే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రైవేటు విద్యాసంస్థలు మాత్రం ఆన్ లైన్ క్లాసులంటూ ఏదో క్లాసులు నడిపిస్తున్నారు.

అయితే పరిస్థితి ఇలా ఉన్నా.. చాలా పాఠశాలలు మాత్రం తల్లిదండ్రులను ఫీజులు ముక్కు పిండి వసూలు చేస్తున్నాయి. అతి కొద్ది మందితోనే ఆన్ లైన్ క్లాసులు చెప్పిస్తున్నాయి. మెయింటైన్స్ లేకపోయినా ఫీజులు మాత్రం తప్పవంటున్నారు. ఇలాంటి వారికి ఏపీ సీఎం జగన్గుడ్ న్యూస్ చెప్పారు. ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో ఫీజు వసూళ్లపై ఏపీ ప్రభుత్వం నియంత్రణకు ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కారణంగా ప్రజల ఆర్ధిక కష్టాలను దృష్టిలో ఉంచుకుని ఫీజులు తగ్గించుకోవాలని ఆదేశించింది.

ఈ మేరకు ట్యూషన్ ఫీజులో 30 శాతం మేర తగ్గించాలని జగన్ సర్కారు అన్ని పాఠశాలలకూ ఉత్తర్వులు ఇచ్చింది. కరోనా కారణంగా చాలా కాలం పాటు స్కూళ్లు, కాలేజీలు తెరవలేదు కాబట్టి నిర్వహాణ భారం తగ్గి ఉంటుందని జగన్ సర్కారు భావిస్తోంది. నవంబర్ రెండో తేదీ నుంచి స్కూళ్ల ప్రారంభించనున్న క్రమంలో ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు ఆ మేరకు సిలబస్ కూడా తగ్గించాలని కూడా పాఠశాలలకు జగన్ సర్కారు సూచించింది.

అంటే ప్రైవేటు స్కూళ్లు కూడా తమ ఫీజులను 30 శాతం మేరకు తగ్గించాల్సిందేనన్నమాట. అంటే ఈ మేరకు విద్యార్థుల తల్లిదండ్రులపై మూడో వంతు భారం తగ్గుతుంది. ఈ నిర్ణయం విద్యార్థుల తల్లిదండ్రులకు కాస్త ఊరట కలిగిస్తుందనడంలో సందేహం లేదు. అయితే ఈ ఆదేశాన్ని ప్రైవేటు పాఠశాలలు ఎంత వరకూ పాటిస్తాయో చూడాలి. జగన్ సర్కారు ఆదేశం బాగానే ఉంది.. అమలు విషయంలోనూ ప్రభుత్వం చొరవ చూపాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: