తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఇక ఈ గోదావరి జిల్లాలు అంటే మర్యాదలకు మారు పేరు అని తెలుగు రాష్ట్రాల్లో అందరూ చెప్తారు. ఇక సంక్రాంతి పండుగ అంటే చాలు ఆంధ్రప్రదేశ్‌లోని పల్లెలన్నీ కళకళలాడుతాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాలైతే కోడి పందేలు, పండగ శోభతో మరింత వెలిగిపోతుంటాయి. గోదావరి జిల్లాలంటే అందరికీ గుర్తొచ్చేది అతిథులకు చేసే మర్యాదలు. ఇక ‘సంక్రాంతి’ అల్లుళ్ల సంగతి చెప్పేదేముంది? రకరకాల వంటలు ముందు పెట్టి అల్లుళ్ల పొట్టలతో ‘ఫుడ్‌ బాల్’ ఆడేస్తారు. 

ఇక సాధారణంగా సంక్రాంతి పండుగకు కొత్త అల్లుళ్లు అత్తవారింటికి వెళ్తుంటారు. కొత్త అల్లుళ్లకు అత్తమామలు ఘనంగా మర్యాదలు చేయడం మన సంప్రదాయం. అయితే గోదారాళ్ల మర్యాదల సంగతి చెప్పేదేముంది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇంటికి వచ్చిన కొత్త అల్లుడికి ఓ అత్త తన చేతివాటం చూపించింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఓ అత్త రకరకాల వంటలతో అల్లుడు అబ్బురపోయేలా చేసింది. మొత్తం 125 వంటలు అల్లుడి ముందు పెట్టి, పక్కన కూతుర్ని కూర్చోపెట్టింది. ఇక, ఆ అల్లుడి పరిస్థితి ఊహించండి! వంటలన్నీ తినెయ్యాలన్న కోరిక ఉన్నా, అన్ని తింటే ఇంకేమైనా ఉందా?

అయితే మొత్తానికి ఆ అల్లుడు ఎలాగోలా కష్టపడి అన్ని వంటలు అలా.. అలా.. రుచి చూసి.. బ్రేవ్, అంటూ ‘పొట్ట చేత పట్టుకుని’ హమ్మయ్యా అని ముగించాడు. అత్తింటి వారు చూపించిన మమకారానికి ఫిదా అయిపోయాడు. మొత్తాని ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి నెటిజన్లు ‘ఔర.. ఔరా..’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 125 వంటలు లాగిస్తున్న అల్లుడిని చూసి కుళ్లుకుంటూ.. అత్త మర్యాదలకు ఫిదా అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: