నెల్లూరు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ ‌పై కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాము చెప్పింది చేయలేదనే ఆగ్రహంతో.. బహిరంగసభలోనే ఎస్పీని ఇష్టమొచ్చినట్లు తిట్టిపోశారు. నాతో పెట్టుకోకు ఎవరి ప్రభుత్వం అనుకుంటున్నావ్.. ఉన్న కొన్ని రోజులైనా జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించారు. మా ఖర్మ కొద్దీ ఎస్పీగా వచ్చావంటూ తలకొట్టుకున్నారు. రెండునెలలు వుంటావో.. మూడు నెలలు ఉంటావో తెలియదు కానీ ఉన్నన్ని రోజులూ మంచిగా ఉండు అని వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి... నెల్లూరు ఎస్పీ భాస్కర్ భూషణ్ ను హెచ్చరించారు.

             టీడీపీకి చెందిన మాజీ మంత్రి సూచనతో.. ఎస్పీ కేసు నమోదు చేయలేదని నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆరోపించారు. నువ్వు నెల్లూరు జిల్లాకు ఎస్పీవా లేదంటే టీడీపీ ఏజెంట్‌వా అంటూ ఎస్పీపై విరుచుకుపడ్డారు. ఎస్పీ అనుమతి లేనిదే ఎస్టీ, ఎస్సీ కేసులు పెట్టకూడదా? 13 జిల్లాల్లో ఇలాగే జరుగుతోందా? అని ప్రశ్నించారు. రెండు రోజులు ఉంటావు పోతావు.. అధికారంలో వున్న మామాట వినవా?.. తమాషాలు వద్దు.. డీజీపీ నిన్ను కాపాడతారని అనుకుంటున్నావా..? బాగుండదు చెబుతున్నాను అంటూ బహిరంగసభలోనే ఎస్పీపై నల్లపురెడ్డి  తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

    ఎస్పీపై వైసీపీ ఎమ్మెల్యే ఈ స్థాయిలో విరుచుకుపడటానికి కారణం టీడీపీ కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టొద్దని చెప్పడమేనని తెలుస్తోంది. నల్లపురెడ్డి కొంత మంది టీడీపీ కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టమన్నారు. అయితే ఈ విషయం ఎస్పీ దృష్టికి వెళ్లడంతో.. తప్పుడు కేసులు పెట్టవద్దని ఆయన పోలీసులకు చెప్పారట. దీంతో పోలీసులు టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టలేదు. దీంతో తాను చెప్పినా కేసులు పెద్దలేదంటూ నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అలా ఫైరయ్యారట. జిల్లా ఎస్పీని ఉద్దేశించి బహిరంగ సభలో అధికార పార్టీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: