ఇండియాలో కరోనా టీకా అందుబాటులోకి వచ్చింది. కరోనా టీకా కోసం ప్రపంచం దాదాపు ఏడాదిగా ఎదురు చూసింది. మొత్తానికి ఈ నెలలోనే కరోనాటీకా అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, ఇండియా, రష్యా వంటి దేశాల్లో కరోనా టీకా పంపిణీ ప్రారంభమైంది కూడా. మన దేశంలో ముందు కరోనా వారియర్స్‌కు టీకా ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని చోట్ల కరోనా టీకాలు వికటిస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే లక్షల మందికి టీకాలిస్తే ఒకరిద్దరికి రియాక్షన్ రావడం పెద్ద విషయం కాదు.

అయితే.. కొన్నిచోట్ల వాక్సిన్ సీరియస్ అవుతున్న ఘటనలూ వెలుగు చూస్తున్నాయి. ఈ సమయంలో  కొన్ని లక్షణాలు ఉన్నవారు టీకా తీసుకోవద్దని టీకాను తయారు చేసిన సంస్థలు చెబుతున్నాయి. కొవిషీల్డ్‌లో ఉండే పదార్థాల వల్ల గతంలో తీవ్రమైన అలర్జీ లక్షణాలు ఎదుర్కొన్నవారు.. కొవిషీల్డ్‌ టీకా తీసుకోవద్దని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించింది. ఎల్‌-హిస్టిడైన్, హైడ్రోక్లోరైడ్‌ మోనోహైడ్రేట్‌, మెగ్నీషియం క్లోరైడ్‌ హెక్సాహైడ్రేట్‌, పాలీసోర్బేట్‌ 80, ఇథనాల్‌, సుక్రోస్‌, సోడియంక్లోరైడ్‌, డిసోడియం ఎడిటేట్‌ డిహైడ్రేట్‌ తదితర పదార్థాలు కొవిషీల్డ్‌లో వాడారు.

కొవిషీల్డ్‌ టీకా వల్ల కలిగే లాభనష్టాలను టీకా తీసుకునే వారికోసం ఈ తయారీ సంస్థలు తమ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతున్నాయి. అంతే కాదు.. టీకా తీసుకునే ముందు గతంలో ఏదైన ఔషధం, ఆహారం, టీకా లేదా కొవిషీల్డ్‌లో ఉన్న పదార్థాల వల్ల అలర్జీ లక్షణాలు వచ్చి ఉంటే ఆ విషయాన్ని ఆరోగ్య సిబ్బందికి తెలియజేయాలని ఈ సంస్థలు చెబుతున్నాయి. జ్వరం, రక్తస్రావం రుగ్మత, రక్తం పలుచగా ఉండే లక్షణాలు కలిగి ఉంటే టీకా తీసుకునే ముందు చెప్పాలని సీరం సంస్థ తెలిపింది.

వీటితో పాటు.. గర్భంతో ఉన్నా, గర్భం దాల్చే అవకాశం ఉన్నా,  పిల్లలకు పాలిచ్చే వారైతే ఆ విషయాన్ని కూడా ముందే వైద్య సిబ్బందికి తెలియజేయాలని సీరం సంస్థ చెబుతోంది. కోవాగ్జిన్ తయారు చేసిన భారత్ బయోటెక్ కూడా ఇలాంటి సూచనలే చేసింది. అందుకే టీకా తీసుకునేవారు ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి మరి. 

మరింత సమాచారం తెలుసుకోండి: