ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సంఘం వర్సెస్ సిఎం జగన్ గా  పరిస్థితి ఉన్న సంగతి తెలిసిందే. రాజకీయంగా ఈ వ్యవహారం ఎటు తిరుగుతుందో అని అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కు ఎమ్మెల్సీ అశోక్ బాబు బహిరంగ లేఖ రాసారు. నాడు ఈసీని విమర్శించడం రాజ్యాంగ వ్యతిరేకమన్న బుగ్గన వ్యాఖ్యలు గుర్తు చేసిన అశోక్ బాబు... నేడు రాష్ట్రంలో ఎన్నికల సంఘాన్ని తులనాడుతుంటే.. మేధావిగా చెప్పుకునే బుగ్గన ఏం చేస్తున్నారు అని ఈ సందర్భంగా ప్రశ్నించారు.

తప్పు చేస్తే చీల్చి చెండాడుతానన్న బుగ్గన.. ఇప్పుడెందుకు సైలైంట్ అయ్యారు.? అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల కమిషనర్ పై వ్యక్తిగత దాడికి దిగిన వారి జాబితా లేఖలో ఆయన విడుదల చేసారు. అమెరికాలో ట్రంప్.. ఏపీలో జగన్.. రాజ్యాంగేతర శక్తులుగా నిలిచారు అని ఆయన ఆరోపించారు. ఎన్నికల కమిషన్‌ కు రాష్ట్ర ప్రభుత్వ సహాయ నిరాకరణ రాజ్యాంగ వ్యతిరేకం అని మండిపడ్డారు. వీడియో కాన్ఫరెన్స్ లకు గైర్హాజరు ప్రజాస్వామ్య హననమే అని అన్నారు. ఎన్నికల నిర్వహణపై పూర్తి అధికారాలు ఎన్నికల సంఘానివే అని ఈ సందర్భంగా స్పష్టం చేసారు.

వైసీపీ ప్రభుత్వం ఎన్నికల సంఘం పట్ల మూర్ఖంగా వ్యవహరిస్తోంది అని విమర్శించారు. న్యాయస్థానాల ఆదేశాలను కూడా ప్రభుత్వం అమలు చేయదా.? అని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగ సంస్థల్ని చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు అని మండిపడ్డారు. పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నందుకే ఎన్నికలంటే భయం అని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిషన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతలపై ఏం చర్యలు తీసుకుంటారు.? అని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్యం అనే పదానికి అర్థం లేకుండా చేస్తున్నారు అని విమర్శించారు. జగన్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: