కరోనా కాస్త తగ్గుతుందనుకున్న సమయంలో కొత్త స్ట్రయిన్లు వస్తున్నాయన్న వార్తలు కొన్ని రోజుల క్రితం కలకలం సృష్టించాయి. యూకే స్ట్రయిన్, దక్షిణాఫ్రికా స్ట్రయిన్, బ్రెజిల్ స్ట్రయిన్ అంటూ హడలెత్తించాయి. అందులోనూ లండన్‌లో కొత్త  స్ట్రయిన్ల కారణంగా మళ్లీ లాక్ డౌన్ విధించడంతో అంతా కంగారు పడ్డారు. ఇవి మళ్లీ ఎక్కడ విజృంభిస్తాయో అని హడలెత్తిపోయారు. కానీ ప్రస్తుతానికి ఆ ముప్పుమీ కనిపించడం లేదు. దేశంలో కరోనా ఉద్ధృతి కొన సాగుతున్నా.. రోజూవారీ కేసులు కొంతమేరకు తగ్గుతూనే ఉన్నాయి.

ఇక కొత్త స్ట్రయిన్ల లెక్కలు చూస్తే.. యూకే, సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్‌ కరోనా స్ట్రెయిన్‌ కేసులు అదుపులోనే ఉన్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాలు ప్రకారం యూకే స్ట్రెయిన్‌ 19 కొత్త  కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు ఆ దేశం నుంచి వచ్చిన వారిలో మొత్తంగా 187 మంది వైరస్‌ బారిన పడ్దారు. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వారిలో ఆరుగురు,  బ్రెజిల్‌ నుంచి వచ్చిన వారిలో ఒకరికి పాజిటివ్‌ వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. మొత్తంగా కొత్త స్ట్రయిన్ కేసులు  213  కేసులు నమోదయ్యాయి.

అలాగని నిర్లక్ష్యం కూడదు. అంత ర్జాతీయ ప్రయాణాలు చేసేవారు కరోనాపై అప్రమత్తంగా ఉండాల్సిందే. యూకే, మధ్య ఆసియా, యూరప్‌ మినహా ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని కేంద్రం సూచించింది. బ్రిటన్‌, సౌత్‌ ఆఫ్రికా, బ్రెజిల్‌లలో బయట పడిన కరోనా వైరస్‌ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్నా.. ఇండియాలో మాత్రం ఆ పరిస్థితి లేకపోవడం ఊరట కలిగిస్తోంది.

యూకే స్ట్రెయిన్‌ కన్నా సౌత్‌ ఆఫ్రికా, బ్రెజిల్‌ వైరస్‌లు అత్యంత ప్రభావ వంతమైనవని నిపుణులు చెబుతున్నారు. దక్షిణాఫ్రికా, బ్రెజిల్ వైరస్‌లను నియంత్రించడానికి ప్రయోగాలు జరుగుతున్నట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ మెడికల్‌ రీసెర్చ్‌తెలిపింది. ఎలాగూ వాక్సినేషన్ ఊపందుకుంటోంది కాబట్టి.. ఇక కరోనా భయం బాగా తగ్గినట్టే చెప్పుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: