ఏపీలో జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని ప్రతిపక్షాలు నిరసన దీక్షలకు దిగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ పది డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు మొదలుపెట్టింది. ప్రధానంగా ఆస్తి పెంపుని వ్యతిరేకిస్తూ టీడీపీ పోరాటం చేస్తుంది. అలాగే కరోనాతో మృతి చెందినవారి కుటుంబాలని, ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకోవాలని డిమాండ్ చేస్తుంది.

అటు బీజేపీ సైతం ఆస్తిపెంపు విషయంలో వైసీపీ ప్రభుత్వాన్ని గట్టిగా టార్గెట్ చేసింది. ఉచితాలు ఇచ్చుడు-పన్నులు పెంచుడు పేరుతో ధర్నాలు చేస్తుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డైరక్ట్‌గా ఫీల్డ్‌లోకి దిగి మరీ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. అటు కాంగ్రెస్ అధ్యక్షుడు శైలజానాథ్ సైతం జగన్‌ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు. ఇక కమ్యూనిస్టులు అదే బాటలో ఉన్నారు.

కానీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం ఏపీ రాజకీయాల్లో కనిపించడం లేదు. ఆ పార్టీకి చెందిన నేతలు అక్కడక్కడ బీజేపీతో కలిసి పోరాటం చేస్తున్నారు తప్ప, ప్రత్యేకంగా జనసేనకంటూ ఓ ప్రణాళిక లేకుండా పోయింది. అసలు పవన్ కల్యాణ్ ఏపీలో అడుగుపెట్టి చాలారోజులు అయిపోయింది. తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికలో మాత్రమే పవన్ కల్యాణ్ కనిపించారు. తర్వాత నుంచి పవన్ ఏపీ రాజకీయాల్లో అడ్రెస్ లేరు. కనీసం పార్టీని బలోపేతం చేసే కార్యక్రమం ఏది చేయడం లేదు. పోనీ హైదరాబాద్‌లో ఉంటూనే, పార్టీ నేతలకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయాల్సిన బాధ్యత పవన్‌పై ఉంటుంది.

కానీ పవన్ అలాంటి కార్యక్రమాలు ఏమి చేయడం లేదు. కరోనా తీవ్రత తగ్గడంతో ప్రతిపక్షాలు ఏదొక రూపంలో ప్రజల్లో ఉండటానికి ప్రయత్నిస్తున్నాయి. పవన్ మాత్రం ఆ పని చేయడం లేదు. అయితే ప్రతిపక్షాలు చేసే నిరసనలు ప్రజలకు ఏ మాత్రం రీచ్ అవుతాయనే విషయాన్ని పక్కనబెడితే కనీసం పోరాడాల్సిన బాధ్యత పవన్‌పై ఉంటుంది. మరి చూడాలి రానున్న రోజుల్లో పవన్ ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పోరాటాలు చేస్తారో.

మరింత సమాచారం తెలుసుకోండి: