
అయితే ఇప్పటి వరకు గవర్నర్ల వ్యవస్థలో కోర్టు జోక్యం చేసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న చట్టాలను గవర్నర్లు తమ అధికారంతో అడ్డుకోవడంతో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఒకసారి అసెంబ్లీలో బిల్లు పాస్ అయిన తర్వాత ఆమోదం కోసం గవర్నర్ కు పంపాలి. ఒకవేళ గవర్నర్ దానిని తిరస్కరిస్తే మరోసారి చర్చించి బిల్లు పంపాలి. ఈ సందర్భంలో గవర్నర్ దానిని తప్పనిసరిగా ఆమోదించాలి. కానీ గవర్నర్లు వాటిని రాష్ట్రపతికి సిఫార్సు చేస్తున్నారు. దీనవల్ల బిల్లుల ఆమోదంలో జాప్యం నెలకొంటుంది.
ఇక నుంచి వీటిని రాష్ట్రపతికి పంపిచాలా వద్దా అనే అంశంపై తామే గైడ్ లైన్స్ ఇస్తామని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. శాసన సభ ఆమోదించిన రెండు బిల్లులను కేరళ గవర్నర్ రెండేళ్ల పాటు ఆమోదించకుండా తన వద్దే నిలిపి ఉంచడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై విచారించిన జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఇక నుంచి రాష్ట్రపతి సమ్మతి కోసం గవర్నర్లు ఎప్పుడు బిల్లులు పంపాలనే దానిపై మార్గదర్శకాలు రూపొందించే విషయంపై పరిశీలిస్తామని పేర్కొంది. కేరళ ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్ రాష్ట్రపతికి బిల్లులు ఎప్పుడు పంపాలనే విషయంలోను మార్గదర్శకాలు రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సుప్రీం పై విధంగా స్పందించింది.