వైసీపీ తరుపున ఎంపీగా గెలిచి, అదే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న రఘురామకృష్ణంరాజు....అసలు మొదట విమర్శలు చేసిన ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది తాడేపల్లిగూడెం వైసీపీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ. మొదట సొంత పార్టీ ఎమ్మెల్యేలు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని రఘురామ విమర్శించిన సందర్భం అందరికీ తెలిసిందే. అప్పుడు కొట్టు సత్యనారాయణపై రఘురామ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇసుక, ఇళ్ల స్థలాల్లో అక్రమాలకు పాల్పడుతున్నారంటూ పెద్ద ఎత్తున ఆరోపించారు. అయితే రఘురామ ఆరోపణలని వైసీపీ అధిష్టానం లైట్ తీసుకుంది. అక్కడ నుంచే రఘురామ, వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టి రెబల్‌గా తయారయ్యారు.

అంటే రఘురామ రెబల్‌గా తయారవ్వడానికి ఎమ్మెల్యే కొట్టు ఒక కారణం అని తెలుస్తోంది. గత ఎన్నికల్లో కొట్టు వైసీపీ తరుపున తాడేపల్లిగూడెంలో పోటీ చేసి విజయం సాధించారు. ఎమ్మెల్యేగా కొట్టు పర్వాలేదనిపిస్తున్నారు. తాడేపల్లిగూడెంలో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు మినహా, వేరే కార్యక్రమాలు జరగడం లేదు. అసలు రెండేళ్ల నుంచి గూడెంలో అభివృద్ధి శూన్యం.

పైగా కొట్టుపై అవినీతి ఆరోపణలు ఎక్కువైపోయాయి. రఘురామ మాత్రమే కాదు...ప్రతిపక్షాలు టి‌డి‌పి, జనసేనలు సైతం కొట్టు టార్గెట్‌గా అనేక ఆరోపణలు చేస్తున్నాయి. అసలు పశ్చిమ గోదావరిలో ఎక్కువ ఆరోపణలు ఎదురుకుంటున్న ఎమ్మెల్యే కూడా ఈయనే. ఈ ఆరోపణలే ఎమ్మెల్యేకు మైనస్ అయ్యేలా కనిపిస్తున్నాయి. అలా అని ఇక్కడ టి‌డి‌పికి పెద్ద ప్లస్ లేదు. ఆ పార్టీ తరుపున సరైన నాయకులు లేరు. ఈలి నాని, ముళ్ళపూడి బాపిరాజులు పార్టీని పట్టించుకోవడం లేదు.

దీంతో నియోజకవర్గ బాధ్యతలని వలవల మల్లిఖార్జునరావు(బాబ్జీ) చూసుకుంటున్నారు. ఈయన ప్రజా సమస్యలపై బాగానే పోరాటం చేస్తున్నారు. ఇక్కడ జనసేన కూడా స్ట్రాంగ్‌గానే ఉంది. గత ఎన్నికల్లో బొలిశెట్టి శ్రీనివాస్ దాదాపు 36 వేల పైనే ఓట్లు తెచ్చుకున్నారు. ఈయన కూడా దూకుడుగానే పనిచేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ త్రిముఖ పోరు జరిగేలా కనిపిస్తోంది. ఒకవేళ టి‌డి‌పి-జనసేనలు కలిసి బరిలో ఉంటే వైసీపీకి ఓటమి ఖాయమే అని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: